Telugu News Business EMI date can be changed mid loan tenure, check details in telugu
Loan EMIs: జీతం కన్నా ముందే లోన్ ఈఎంఐ తేదీ వచ్చేస్తోందా.. ఇలా చేస్తే నో టెన్షన్..!
రాకేష్ ఒక కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుని నగరంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి, భార్యా పిల్లలతో జీవిస్తున్నాడు. ప్రతి నెలా అతడికి వచ్చే జీతం నుంచి హోమ్ లోన్ ఈఎంఐలు కట్ అవుతున్నాయి. మిగిలిన జీతంతో హాయిగా జీవనం సాగుతోంది. అతడికి ప్రతినెలా ఒకటో తేదీ జీతం పడుతుంది. అందుకునే 3వ తేదీని ఈఎంఐకి గడువుగా పెట్టుకున్నాడు.
ఇటీవల కంపెనీలో జరిగిన మార్పుల నేపథ్యంలో జీతం ప్రతి నెలా ఐదో తేదీ జమ చేస్తున్నారు. అంటే జీతం కన్నా ముందుగానే ఈఎంఐ తేదీ వచ్చేస్తోంది. దీంతో డబ్బులు సర్దుబాటు చేయడానికి రాకేష్ తీవ్ర ఇబ్బందులు పడేవాడు. అనంతరం సహోద్యోగుల సలహాతో ఈఎంఐ తేదీని 8వ తేదీకి మార్చుకున్నాడు. ఒక్క రాకేష్ కి మాత్రమే కాదు అందరికీ ఇలాంటి అవకాశం ఉంది. అది ఎలా చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకులో రుణం తీసుకుని ప్రతి నెలా వాయిదాలు కట్టడం ప్రారంభించిన తర్వాత, ఈ వాయిదా తేదీని మార్చుకునే అవకాశం రుణగ్రహీతలకు ఉంది. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
హెచ్ డీఎఫ్ సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు ఈఎంఐ తేదీని మార్చుకోవడానికి అనుమతి ఇస్తాయి. అంటే ఈఎంఐ తేదీని రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం రుణకాలంలో ఒక్కసారి మాత్రమే ఉంటుంది.
కొందరు డిజిటల్ రుణదాతలు మాత్రం ఇలాంటి మార్పులకు అంగీకరించరు. ఎందుకంటే ఒక్కసారి మీ ఈఎంఐ తేదీని ఫిక్స్ చేశాక, ఆ ప్రాసెస్ లాక్ అయిపోతుంది. మీరు ప్రతినెలా ఆ తేదీన వాయిదా కట్టాల్సిందే.
అందరు రుణగ్రహీతలకు ఇలా ఈఎంఐని మార్చుకునే అవకాశం ఉండదు. ఇప్పటికే వాయిదాలను గడువు అనంతరం కట్టి ఉంటే వర్తించదు. మీ లావాదేవీల నిర్వహణ సక్రమంగా ఉంటేనే అంగీకరిస్తారు. లేకపోతే మీ అభ్యర్థన తిరస్కరిస్తారు.
ఈఎంఐ తేదీ మార్పునకు సంబంధించి బ్యాంకుల వారీగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంట్ చార్జీలు వసూలు చేస్తారు. కాబట్టి ముందుగానే వాటిని తనిఖీ చేసుకోవాలి.
ప్రయోజనాలు
జీతం పడిత తర్వాత ఈఎంఐ షెడ్యూల్ తేదీ పెట్టుకుంటే రుణగ్రహీతకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. తేదీ దాటిపోతుందనే ఒత్తిడి ఉండదు.
ఆలస్య రుసుముల బాధ ఉండదు, చెక్కులు బౌన్స్ కావు. జరిమానాలు చెల్లించే అవసరం ఉండదు.
క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. ప్రతి నెలా సమయానికి వాయిదాలు చెల్లిస్తే స్కోర్ ఇంకా మెరుగవుతుంది.
మీ బడ్జెట్ ను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈఎంఐలకు పోను మిగిలిన మొత్తంలో ఇంటిని నడుపుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్ పెరగడం వల్ల భవిష్యత్తులో తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది.