
ఎమర్జెన్సీగా డబ్బు అవసరం వచ్చినప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలా? లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా? అనే డౌట్ చాలామందిలో కనిపిస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ లోన్ తీసుకోవాలి అనేది వ్యక్తిగత పరిస్థితులు, అవసరాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గోల్డ్ లోన్ విషయంలో ప్రధాన ప్రయోజనం తక్కువ వడ్డీ రేటు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం వల్ల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తక్కువ రిస్క్‌గా భావిస్తాయి. అందువల్ల పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ సాధారణంగా తక్కువగా ఉంటుంది. అదనంగా గోల్డ్ లోన్ త్వరగా మంజూరు అవుతుంది, క్రెడిట్ స్కోర్ ప్రభావం తక్కువగా ఉంటుంది. అత్యవసరంగా తక్కువ ఖర్చుతో డబ్బు అవసరమైనప్పుడు ఇది అనుకూలంగా ఉంటుంది. అయితే బంగారం తాకట్టు పెట్టాల్సి ఉండటం ప్రధాన లోపంగా నిపుణులు చెబుతున్నారు. చెల్లింపులు ఆలస్యమైతే బంగారం వేలం వేయబడే ప్రమాదం ఉంటుంది.
మరోవైపు పర్సనల్ లోన్ పూర్తిగా అన్‌సెక్యూర్డ్ రుణం. ఎలాంటి తాకట్టు అవసరం లేకుండా బ్యాంకులు మంజూరు చేస్తాయి. అందువల్ల బంగారం లేదా ఆస్తి లేకున్నా తీసుకోవచ్చు. వినియోగంలో కూడా పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ దీనిపై వడ్డీ రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బలంగా లేకపోతే రుణం మంజూరు కావడం కష్టమవుతుంది లేదా వడ్డీ మరింత పెరుగుతుంది.
నిపుణుల సూచన ప్రకారం, తక్కువ వడ్డీతో త్వరగా రుణం కావాలనుకునే వారు, బంగారం అందుబాటులో ఉన్న వారు గోల్డ్ లోన్ వైపు మొగ్గు చూపవచ్చు. అయితే తాకట్టు పెట్టడానికి బంగారం లేకపోతే లేదా ఆస్తిని రిస్క్‌లో పెట్టాలనిపించకపోతే పర్సనల్ లోన్ సరైన ఎంపిక అవుతుంది. మొత్తంగా అవసరం, తిరిగి చెల్లించే సామర్థ్యం, వడ్డీ భారం వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి