Eggs Price: సామాన్యులకు షాక్.. కోడి గుడ్ల ధరలు ఆల్ టైం రికార్డ్.. ఇప్పుడు ఒక్కొకటి ఎంతంటే..?

చికెన్ ధరలతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా గుడ్ల ధరలు చిన్న చిన్నగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మరింతగా పెరిగి ఆల్ టైం రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే..

Eggs Price: సామాన్యులకు షాక్.. కోడి గుడ్ల ధరలు ఆల్ టైం రికార్డ్.. ఇప్పుడు ఒక్కొకటి ఎంతంటే..?

Updated on: Dec 21, 2025 | 12:25 PM

సామాన్యుడికి ఎప్పుడూ తక్కువ ధరలో అందుబాటులో ఉండే కోడి గుడ్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల వీటి ధరలు ఆమాంతం పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది నెలలుగా పెరుగుతూ వస్తున్న గుడ్ల ధరలు బ్రేకుల్లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5గా ఉన్న గుడ్డు ధర.. ఇటీవల రూ.6కి పెరిగింది. ఆ తర్వాత పెరుగుతూ వస్తూ ఏకంగా రూ.7.30కి చేరుకుంది. ఇప్పుడు ఏకంగా గుడ్డు ధర రూ. 8కు చేరుకుంది. గుడ్డు ధర ఇంతలా పెరగడం చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గుడ్డు ధరలు భారీగా పెరగడంతో సామాన్యుల ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి.

ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర రూ.7.30గా ఉండగా.. రిటైల్ మార్కెట్‌లో రూ.8కి అమ్ముతున్నారు. ఇక 30 గుడ్లు గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. ఇప్పుడు రూ.210 నుంచి రూ.220కి చేరుకుంది. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని, ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరకే లభించే గుడ్ల ధరలు ఒకేసారి పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. గుడ్లు అనేవి ప్రతీ ఇంట్లో డైలీ డైట్‌లో వాడుతూ ఉంటారు. ఇప్పుడు వాటి ధరల పెరుగుదల సామాన్యులపై ప్రభావం చూపనుంది. అటు చికెన్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు కేజీ చికెన్ రూ.230కి లభించగా.. ఇప్పుడు రూ.270 వరకు ఉంది.

ఇక నాటు కోడి గుడ్లు అయితే ఒక్కొకటి రూ.15గా ఉంది. అటు గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగాడం వెనుక అనేక కారణాలు వ్యాపారుల నుంచి వినిపిస్తున్నాయి. గుడ్లకు డిమాండ్ బాగా పెరిగిందని, కానీ దానిని తగ్గట్లు ఉత్పత్తి లేదని అంటున్నారు. అలాగే దాణా, మక్కలు, చేపపొట్టు వంటి ఖర్చులు కూడా ఫారం ఉత్పత్తిదారులకు పెరిగిపోయాయి. ధరలు పెరగడానికి ఇవే కారణాలుగా చెబుతున్నారు.