
గ్యాస్ వినియోగదారులపై భారం మోపేలా మరో నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై అదనపు రుసుములు వసూలు చేయాలని సమాలోచనలు చేస్తోంది. ఎల్పీజీ గ్యాస్‌కు సంబంధించి కిలోపై రూ.1.29పై రుసుంలు విధించాలని భావిస్తోంది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఈ రుసుం విధించేందుకు సిద్దమవుతోంది. దేశంలో ఇంధన నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ రుసుంలు వసూలు చేయాలని చూస్తోంది. అంతర్జాతీయంగా యుద్ద పరిస్ధితుల క్రమంలో దేశంలో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎల్పీజీ అవసరాలను తీర్చేందుకు భారీ ప్లాన్ వేస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 4 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం అదనపు రుసుంల రూపంలో ఎల్పీజీ వినియోగదారులపై భారం మోపనుందని తెలుస్తోంది.
ఇంటి అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై కిలోకు రూ.1.29 రుసుము విధించాలని యోచిస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.4375 కోట్ల ఆదాయం లభించనుంది. అయితే ఈ రుసుంలు విధిస్తే సామాన్యులపై భారం పడుతుంది. ఈ అదనపు ఛార్జీల వల్ల గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయి. ఒక సాధారణ గృహ సిలిండర్ ధర సుమారుగా రూ.18 మేర పెరిగే అవకాశం ఉంది. ఇక సీఎన్జీకి సంబంధించి ప్రతి ప్రామాణిక ఘనపు మీటరుకు రూ.1.43 సుంకాన్ని విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీని ద్వారా ఏటా సుమారుగా రూ.9,500 కోట్ల ఆదాయం కేంద్రానికి లభిస్తుంది.ఈ రెండు సుంకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు 1.5 బిలియన్ డాలర్లు సమకూరవచ్చు. ఈ డబ్బును ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జి నిల్వ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించే అవకాశముంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ రుసుములు ఖరారు చేస్తే గ్యాస్ బిల్లులు సుమారు 2 శాతం మేర పెరగవచ్చు. దీని వల్ల గ్యాస్ వినియోగదారులపై భారం పడుతుంది.
ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగ్గా.. వీటిని విధిస్తే మరింత పెరగుతుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా తుది ఆమోదం లభించలేదు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చల్లో ఉంది. కేంద్రం ఆమోదం తెలిపి కేబినెట్‌లో ప్రవేశపెట్టాక ఇది అమల్లోకి వస్తుంది. అయితే రాబోయే సుమారు 10 సంవత్సరాలలో ఎల్పీజీ నిల్వలను పెంచే విధంగా కేంద్రం భారీ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సుమారు 42 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులలో సగానికి పైగా నిల్వ మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఖర్చు చేయనుండగా.. మిగిలిన మొత్తాన్ని ఇంధనాన్ని కొనుగోలు చేసి నిల్వ చేయడానికి వెచ్చిస్తారు.