
దేశీయ సూపర్ మార్ట్ దిగ్గజం డీమార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ కిరాణా సేవలందించే తన ఈ కామర్స్ విభాగం డీమార్ట్ రెడీ కార్యకలాపాలను ఏడు నగరాల్లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ తన 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మార్కెట్లో క్విక్ కామర్స్ యాప్స్ నుండి వస్తున్న విపరీతమైన పోటీ, మారుతున్న వినియోగదారుల అలవాట్ల నేపథ్యంలో డీమార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. అవెన్యూ ఈ కామర్స్ లిమిటెడ్ సీఈఓ విక్రమ్ దాసు మాట్లాడుతూ.. ‘‘మేము మా వ్యాపార నమూనాని మరింత బలోపేతం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచని ఏడు నగరాల నుండి డీమార్ట్ రెడీ సేవలను నిలిపివేశాం. జూన్ 30 నాటికి మా ఆన్‌లైన్ సేవలు కేవలం 11 ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి” అని తెలిపారు. ఇకపై కంపెనీ పెద్ద మెట్రో నగరాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టనుంది.
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్ కామర్స్ కంపెనీలు 10 నుండి 20 నిమిషాల్లోనే గ్రాసరీస్ డెలివరీ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. దీనికి భిన్నంగా డీమార్ట్ రెడీ ఇప్పటికీ షెడ్యూల్డ్ డెలివరీ లేదా స్టోర్ పికప్ మోడల్‌లోనే నడుస్తోంది. అయితే డిమార్ట్ ఈ వేగవంతమైన డెలివరీ పోటీ పడకుండా.. లాభదాయకమైన వ్యాపారానికే మొగ్గు చూపుతుంది. తన పాత నమ్మకమైన ఎవ్రీడే లో కాస్ట్, ఎవ్రీడే లో ప్రైస్ విధానాన్నే నమ్ముకుని ముందుకు సాగుతోంది.
ఒకవైపు డీమార్ట్ రెడీ తన ఆన్‌లైన్ సేవలను కుదిస్తూ ఉంటే.. మరోవైపు డీమార్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పెట్టుబడిదారు రాధాకిషన్ దమానీ ఓపెన్ మార్కెట్ ద్వారా బ్లింకిట్ మాతృ సంస్థ అయిన ఎటర్నల్‌లో వాటాలను కొనుగోలు చేయడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. డీమార్ట్ నేరుగా క్విక్ కామర్స్ రేసులోకి రాకపోయినా.. దమానీ మాత్రం ఆ రంగంలో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
ఆన్‌లైన్‌లోనే కాకుండా డీమార్ట్ ప్రధాన రిటైల్ వ్యాపారంలో కూడా వృద్ధి కొద్దిగా మందగించింది. కంపెనీ ఎండీ, సీఈఓ అన్షుల్ అసవా తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్ల కంటే పాత స్టోర్లలో గత ఏడాది 7.1 శాతంగా ఉన్న లైక్ ఫర్ లైక్ వృద్ధి, ఈసారి 5.5 శాతానికి పడిపోయింది. అయితే మెట్రో నగరాల కంటే మెట్రోయేతర నగరాల్లోని స్టోర్లు మంచి ప్రదర్శన కనబరిచాయి.
వృద్ధి స్వల్పంగా తగ్గినప్పటికీ ఆదాయం, లాభాల పరంగా డీమార్ట్ మెరుగైన ఫలితాలనే సాధించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి..
క్విక్ కామర్స్ కంపెనీలు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. డీమార్ట్ మాత్రం నష్టాలు వచ్చే నగరాల నుండి తప్పుకుంటూ కేవలం వేగవంతమైన డెలివరీల కోసం ఆరాటపడకుండా స్థిరమైన, లాభదాయకమైన వ్యాపార నమూనా వైపే అడుగులు వేస్తుంది.