
Divorce Home Loan Rules Telugu: విడాకులతో వివాహ బంధం ముగిసినంత మాత్రాన ఇంటి రుణం (Home Loan) బాధ్యత ముగిసిపోదు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తి పంపకం, ఇంటి యాజమాన్యం, మిగిలిన ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? ఇంటిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని ఎలా పంచుకోవాలి? వంటి అనేక ఆర్థిక, న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి హోమ్‌లోన్ తీసుకున్న సందర్భాల్లో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి.
భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత వారి మధ్య కుదిరే సెటిల్‌మెంట్ ఒప్పందం వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య మాత్రమే వర్తిస్తుంది. అది బ్యాంకుతో చేసుకున్న రుణ ఒప్పందాన్ని ఆటోమేటిక్‌గా మార్చదు. సుప్రీంకోర్టు అడ్వొకేట్ ఆన్ రికార్డ్ విశాల్ గెహ్రానా ప్రకారం, చాలా హోమ్‌లోన్ ఒప్పందాల్లో సహ రుణగ్రహీతలు (Co-borrowers) సంయుక్తంగా, విడివిడిగానూ రుణ బాధ్యతను కలిగి ఉంటారు. అంటే బకాయి మొత్తాన్ని వసూలు చేయడానికి బ్యాంకు ఇద్దరిలో ఎవరికైనా నోటీసు ఇవ్వవచ్చు లేదా బకాయి చెల్లించాలని కోరవచ్చు.
ఉదాహరణకు, విడాకుల సమయంలో భర్త ఇకపై అన్ని ఈఎంఐలు చెల్లించాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నప్పటికీ, ఆ ఒప్పందం కారణంగా బ్యాంకు వద్ద భార్య బాధ్యత ఆటోమేటిక్‌గా తొలగిపోదు. భర్త ఈఎంఐలు చెల్లించకపోతే, రుణ ఒప్పందం ప్రకారం బ్యాంకు మరో సహ రుణగ్రహీతను కూడా బకాయి చెల్లించమని కోరే అవకాశం ఉంటుంది.
అందువల్ల బ్యాంకు అధికారికంగా ఒక వ్యక్తిని రుణ బాధ్యత నుంచి విడుదల చేసే వరకు ఇద్దరి క్రెడిట్ రికార్డుపైనా చెల్లింపుల ప్రభావం ఉండొచ్చు. సాధారణంగా రీఫైనాన్సింగ్ లేదా రుణ పునర్వ్యవస్థీకరణ వంటి ప్రక్రియ ద్వారా బ్యాంకు అనుమతి పొందిన తర్వాతే ఒకరి పేరు రుణ బాధ్యత నుంచి తొలగుతుంది.
భార్యాభర్తలు కలిసి హోమ్‌లోన్ తీసుకున్నారని, ఇంటిపై ఇద్దరికీ సమాన యాజమాన్య హక్కులు ఉంటాయని భావించడం సరైనది కాదు. న్యాయ నిపుణుల ప్రకారం.. ఇంటి యాజమాన్యం ఎవరికి ఉంది? ఎవరి వాటా ఎంత? అనే విషయాన్ని రిజిస్టర్ చేసిన టైటిల్ డాక్యుమెంట్లు నిర్ణయిస్తాయి. రుణంలో ఇద్దరూ సహ రుణగ్రహీతలుగా ఉండటం మాత్రమే ఇంటిపై 50:50 యాజమాన్యాన్ని నిర్ధారించదు.
అంటే ఒకరు ఎక్కువ మొత్తంలో ఈఎంఐలు చెల్లించినా, ఆ కారణంతోనే ఇంటిపై అదనపు యాజమాన్య హక్కు ఏర్పడుతుందని చెప్పలేం. అదే సమయంలో, ఇంటి టైటిల్‌లో ఒకరి పేరు మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల్లో మరొకరికి చట్టపరమైన నివాస హక్కులు ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా, గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం కింద కొన్ని సందర్భాల్లో మహిళకు షేర్డ్ హోమ్‌లో నివసించే హక్కు ఉండవచ్చు. ఇది ఆస్తి యాజమాన్య హక్కుతో సమానం కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
విడాకుల అనంతరం భార్యాభర్తలు ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకుంటే, ముందుగా ఆస్తిపై ఉన్న హోమ్‌లోన్‌ను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇల్లు బ్యాంకుకు మార్ట్గేజ్ అయి, రుణం ఇంకా బకాయి ఉంటే.. సాధారణంగా ఇంటి విక్రయం ద్వారా వచ్చిన మొత్తంలో నుంచి ముందుగా బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాన్ని తీర్చాలి. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆస్తిపై ఉన్న యాజమాన్య హక్కుల ప్రకారం పంచుకోవచ్చు.
ఉదాహరణకు, ఇంటిని రూ.80 లక్షలకు విక్రయించగా, బ్యాంకుకు రూ.30 లక్షల హోమ్‌లోన్ బకాయి ఉందనుకుందాం. ముందుగా ఆ రూ.30 లక్షలను రుణం చెల్లించడానికి వినియోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని సంబంధిత యాజమాన్య వాటాల ఆధారంగా పంచుకునే అవకాశం ఉంటుంది.
ఆస్తి విక్రయం పూర్తయిన తర్వాత పన్ను అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆస్తిని ఎంతకు కొనుగోలు చేశారు? ఎంతకాలం తమ వద్ద ఉంది? ఎంత ధరకు విక్రయించారు? వర్తించే పన్ను నిబంధనలు ఏమిటి? వంటి అంశాల ఆధారంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంటుంది.
ఆస్తిలో ప్రతి వ్యక్తికి ఉన్న అధికారిక యాజమాన్య వాటా ఆధారంగా పన్ను బాధ్యతను అంచనా వేయాల్సి ఉంటుంది. కాబట్టి విడాకుల సమయంలో కేవలం ఇంటి విలువ, ఈఎంఐల గురించే కాకుండా భవిష్యత్ పన్ను బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరం.
విడాకుల సమయంలో ఉమ్మడి హోమ్‌లోన్, ఆస్తి ఉన్న దంపతులు కొన్ని విషయాలను స్పష్టంగా నమోదు చేసుకోవడం మంచిది.
మొత్తంగా చెప్పాలంటే.. విడాకులు వివాహ బంధాన్ని ముగించవచ్చు కానీ హోమ్‌లోన్ ఒప్పందాన్ని ఆటోమేటిక్‌గా ముగించవు. బ్యాంకు నుంచి అధికారికంగా రుణ బాధ్యత నుంచి విడుదల పొందే వరకు సహ రుణగ్రహీతగా ఉన్న వ్యక్తి బాధ్యత కొనసాగవచ్చు. అలాగే, హోమ్‌లోన్‌లో పేరు ఉండటం, ఇంటిపై యాజమాన్య హక్కు ఉండటం రెండూ ఒకటే కాదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.