
వాహనదారులపై ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, సామాన్యుడికి కాస్త ఊరటనిస్తుందనుకున్న కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్ (CNG) కూడా ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. తాజాగా సీఎన్‌జీ ధరలు మరోసారి పెరిగాయి. గడిచిన కేవలం 12 రోజుల్లోనే ఈ ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
తాజా సవరణతో ఈరోజు మంగళవారం (మే 26) సీఎన్‌జీ ధర కిలోకు మరో రూ. 2 మేర పెరిగింది. ఈ వరుస పెంపుదల ప్రభావంతో రాజధాని నగరంలో కొత్త సీఎన్‌జీ ధర ఇప్పుడు కిలోకు రూ. 83.09 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సహజ వాయువు ధరలు పెరగడం, సరఫరాలో వస్తున్న మార్పుల వల్లే ఈ ధరల పెంపు అనివార్యమైందని ఇంధన కంపెనీలు పేర్కొంటున్నాయి.
రవాణా ఖర్చులు: ఆటోలు, క్యాబ్‌లు, పబ్లిక్ బస్సుల్లో సీఎన్‌జీ వాడకం ఎక్కువ. ఈ ధరల పెరుగుదల వల్ల ప్రయాణ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. రవాణా వ్యయం పెరిగితే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. పెట్రోల్ భారాన్ని తట్టుకోలేక సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గు చూపిన మధ్యతరగతి ప్రజలకు ఈ వరుస ధరల పెంపు తీవ్ర నిరాశను మిగుల్చుతోంది.
ఇలాగే ధరలు పెరుగుతూ పోతే ప్రత్యామ్నాయ ఇంధన వనరులను నమ్ముకున్న వాహనదారుల బడ్జెట్ పూర్తిగా తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..