
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా దిగివస్తున్నాయి. ఇరాన్, అమెరికా దేశాలు ఒక శాంతి ఒప్పందానికి అంగీకరించిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ధర దాదాపు 6 శాతం తగ్గి, బ్యారెల్‌కు 88.3 డాలర్లకు పడిపోయింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 93 డాలర్లు పలుకుతోంది. మొత్తంగా చూస్తే మే నెలలో చమురు ధరలు ఏకంగా 16 నుండి 18 శాతం మేర తగ్గడం గమనార్హం. మార్చి, ఏప్రిల్‌లలో విపరీతంగా పెరిగిన ధరలు, ప్రస్తుతం ఐదు వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
చమురు ధరలు ఇంతలా తగ్గడానికి ప్రధాన కారణం ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా రవాణా పునరుద్ధరణకు ఇరాన్ అంగీకరించడమే. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాలలో ఇదొకటి. ప్రపంచ ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ (LNG) సరఫరాలో సుమారు 20 శాతం వాటా ఈ మార్గం గుండానే సాగుతుంది. ఇటీవల యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రవాణా నిలిచిపోయింది. అయితే, నెల రోజుల్లోగా ఇక్కడ సాధారణ వాణిజ్య నౌకాయానాన్ని పునరుద్ధరిస్తామని ఇరాన్ ప్రకటించడంతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో రెండు విదేశీ సూపర్‌ట్యాంకర్లు ఈ మార్గం గుండా నిరాటంకంగా ప్రయాణించాయి.
అమెరికా-ఇరాన్ దేశాలు 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా ప్రాథమిక అంగీకారానికి వచ్చాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు దేశాలు శాంతియుతంగా చర్చలు జరపనున్నాయి. రవాణా మార్గాల పునరుద్ధరణలో భాగంగా వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ కట్టుబడి ఉంది. అయితే, అమెరికాతో పరోక్ష చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని ఇరాన్ అధికారి ఒకరు తెలపగా, శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఖరారు చేయడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం పూర్తిగా కుదిరి, చమురు సరఫరా ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగితే.. ముడి చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెద్ద ఉపశమనం కలిగించే అంశం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..