
బంగారం, వెండి ధర గత ఏడాదిన్నర కాలంగా భారీగా పెరుగుతుండగా.. వీటితో పాటు మరికొన్ని మెటల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి కాపర్. గత ఏడాది కాలంగా రాగి ధరలు కూడా రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. వెండి ధరలకు పోటీగా వీటి ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో కాపర్ ధరలు వెండి కంటే వేగంగా పెరుగుతాయా..? అనే అంచనాలు మార్కెట్ విశ్లేషకుల నుంచి వెలువడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రాగి ధరలు 40 శాతం పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్ల ఏర్పాటులో కాపర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటికి ప్రాధాన్యత ఏర్పడుతున్న క్రమంలో కాపర్ ధరల్లో పెరుగుదుల నమోదవుతోంది. బలమైన డిమాండ్, అధిక ధరలు కారణంగా పెట్టుబడిదారులు ఇప్పుడు కాపర్ స్టాక్స్ వైపు చూస్తున్నారు.
జనవరి 2026లో రాగి ధరలు టన్నుకు దాదాపు 13,000 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. 2026 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుండి దాదాపు 40 శాతం పెరిగాయి. జనవరి చివరిలో స్వల్పంగా తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కోలుకుని పౌండ్‌కు 6 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో భారత్‌లో కాపర్ ఉత్పత్తి కంపెనీలు అయిన హిందూస్తాన్ కాపర్, హిందాల్కో, వేదాంతల్లోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. రేటింగ్ ఏజెన్సీ ICRA అంచనా ప్రకారం.. రాబోయే రెండేళ్లల్లో రాగికి మరింత డిమాండ్ పెరగొచ్చని, ప్రతీ ఏటా 10 నుండి 12 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యంలోని హిందూస్థాన్ కాపర్ వాల్యూ పెరుగుతోంది. దేశంలో మైనింగ్ నుంచి శుద్ది కార్యక్రమాల వరకు అన్నీ ఈ కంపెనీ చేపడుతోంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 3.54 మిలియన్ టన్నుల నుండి 12.2 మిలియన్ టన్నులకు పెంచాలని చూస్తోంది. దీంతో పెట్టుబడిదారులను ఇది ఆకర్షిస్తోంది.
ఇక ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ కూడా రాగి, అల్యూమినియం ఉత్పత్తిలో పేరు పొంది. దాని US అనుబంధ సంస్థ నోవెలిస్ కూడా రాగి ఎగుమతుల్లో బలమైన పెరుగుదలను నమోదు చేసింది. హిందాల్కో ఆదాయం మూడవ త్రైమాసికంలో 14% పెరిగి రూ.66,521 కోట్లకు చేరుకుంది. ఇక వేదాంత కూడా లాభాల్లో కొనసాగుతోంది. దీంతో భవిష్యత్తులో రాగి ఉత్పత్తి ఉన్నా.. దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రాగి ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్ల చెబుతున్నారు. భవిష్యత్తులో రాగి ధరలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు. అటు బంగారం, వెండి ధరలు గత నెలలో భారీగా పెరగ్గా.. ఇప్పుడు కాస్త శాంతించాయి.