Promissory Note: ప్రామిసరీ నోటు రాసేటప్పుడు అందరూ చేసే తప్పులివే.. పైసలు పోతాయ్.!

ప్రామిసరీ నోట్ ప్రాముఖ్యత, దాని కాలపరిమితి, పునరుద్ధరణ విధానాలు, రెవెన్యూ స్టాంప్ ఆవశ్యకత, సాక్షుల ప్రాధాన్యత, డబ్బు చెల్లించని పక్షంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యల గురించి వివరంగా తెలుసుకోండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

Promissory Note: ప్రామిసరీ నోటు రాసేటప్పుడు అందరూ చేసే తప్పులివే.. పైసలు పోతాయ్.!
Promissory Note

Updated on: Apr 15, 2026 | 12:56 PM

ఆర్థిక లావాదేవీలలో ప్రామిసరీ నోట్ అనేది కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఒక బలమైన చట్టబద్ధమైన ఆయుధం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్ వంటి చట్టాల పరిధిలో దీనికి ఉండే ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకోండి. ప్రామిసరీ నోట్‌కు దానిపై ఉన్న తేదీ నుంచి సరిగ్గా మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ గడువు ముగిస్తే ఆ నోటు చట్టపరంగా చెల్లుబాటు కాదు. అయితే, దీనిని పునరుద్ధరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. రుణగ్రహీత నోటు వెనుక వైపు కొంత నగదు చెల్లించినట్లు రాసి సంతకం చేస్తే, ఆ తేదీ నుంచి మరో మూడేళ్ల గడువు లభిస్తుంది. లేదా పాత నోటును రద్దు చేసి, వడ్డీతో కలిపి కొత్త నోటును రాయించుకోవచ్చు. గడువు ముగిసేలోపే కోర్టును ఆశ్రయించడం అన్నింటికంటే సురక్షితమైన మార్గం.

ప్రామిసరీ నోటును సాధారణ ప్రింటెడ్ ఫామ్‌పై రాసినప్పుడు కనీసం 1 రూపాయి రెవెన్యూ స్టాంప్ అంటించడం తప్పనిసరి. రుణగ్రహీత ఆ స్టాంపుపైనే అడ్డంగా సంతకం చేయాలి. స్టాంప్ లేకుండా లేదా దానిపై సంతకం లేని నోటు చట్టబద్ధంగా వీక్ అవుతుంది. అదే స్టాంప్ పేపర్‌పై రాస్తే ప్రత్యేకంగా రెవెన్యూ స్టాంప్ అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును ముందే చెల్లించినట్లు అవుతుంది. అప్పు ఇచ్చే వ్యక్తి ఆర్థిక సామర్థ్యం కోర్టులో కీలకం కాబట్టి, పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేటప్పుడు తగిన ఆధారాలు ఉండాలి.

రాసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

సాక్షులు: నోటుపై కచ్చితంగా ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. వివాదం తలెత్తినప్పుడు వీరే ప్రధాన ఆధారంగా నిలుస్తారు.

స్వదస్తూరీ: సాధ్యమైనంత వరకు రుణగ్రహీత తన సొంత చేతిరాతతో నోటు రాసేలా చూడాలి. ఒకవేళ వేరే వ్యక్తి రాస్తే, ఆ వ్యక్తి వివరాలు, సంతకం కూడా నోటుపై ఉండాలి.

స్పష్టత: తీసుకున్న మొత్తం, వడ్డీ రేటు, తేదీ, తిరిగి చెల్లిస్తాననే వాగ్దానం స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కొట్టివేతలు ఉండకూడదు.

అర్హత: ఇద్దరూ మేజర్లు (18 ఏళ్లు నిండిన వారు) అయి ఉండాలి. మైనర్లు లేదా మానసిక స్థితి సరిగా లేని వారు రాసిన నోట్లు చెల్లవు.

డబ్బు చెల్లించకపోతే తీసుకోవాల్సిన చర్యలు

రుణగ్రహీత డబ్బు ఎగవేసినప్పుడు ముందుగా అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసు పంపాలి. దానికి స్పందన లేకపోతే కోర్టులో కేసు వేసి ‘డిక్రీ’ పొందవచ్చు. డిక్రీ వచ్చిన తర్వాత రుణగ్రహీతకు ఉన్న స్థిర, చరాస్తులను జప్తు చేయవచ్చు. ఒకవేళ ప్రస్తుతం ఆస్తులు లేకపోయినా, భవిష్యత్తులో అతను పొందే ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం చట్టం ద్వారా లభిస్తుంది. అవసరమైతే ‘సివిల్ అరెస్ట్’ చేసే అవకాశం కూడా ఉంటుంది. అప్పు ఇచ్చే ముందే అవతలి వ్యక్తి ఆర్థిక స్థితిని అంచనా వేయడం మరియు పైన పేర్కొన్న చట్టపరమైన జాగ్రత్తలు పాటించడం వల్ల మీ సొమ్ముకు పూర్తి భద్రత లభిస్తుంది.

ఇది చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..

Follow Us