చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే వయసు ఇది. ఈ సమయంలో యువతకు చాలా ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఇంటికి దూరంగా ఉండే పరిస్థితి కలుగుతుంది. ప్రతినెలా చేతికి జీతం అందుతుంది. ఇదే సమయంలో ప్రలోభాలు, అధిక ఖర్చులకు దూరంగా ఉండాలి. పొదుపు చేయడాన్ని మొదలు పెట్టాలి. ప్రతి నెలా రూ.10 వేలు చొప్పున స్టాక్స్ లో పెట్టుబడి పెడితే 20 ఏళ్లకు సుమారు రూ.ఒక కోటి వరకూ దాచుకోవచ్చు. కానీ ఆ సమయంలో వీరు డబ్బులను దుబారా చేసి, మరో పదేళ్ల తర్వాత పొదుపు ప్రారంభిస్తే కేవలం రూ.23 లక్షలు మాత్రమే దాచుకోగలరు. అయితే చాలామంది బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇంట్లోని పెద్దవారు కూడా అలాగే చేయాలని సలహా ఇస్తారు. కానీ 20 ఏళ్ల వయసులో ఉన్న యువతులు ఎస్ఐపీ (సిప్)ని ప్రారంభించవచ్చు. అవి దీర్ఘకాలంలో అత్యధిక రాబడి ఇస్తాయి.
పెళ్లి అనేది జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. వివాహ సంబంధాల సమయంలో డబ్బు విషయాలను మాట్లాడటానికి మహిళలు సంకోచిస్తారు. కానీ భాగస్వామి ఆర్థిక జీవితం, అలవాట్ల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇద్దరికీ క్రమశిక్షణ, పొదుపు ఉండాలి. దానికి అనుగుణంగా పొదుపు ప్రణాళికలు అమలు చేయాలి.
30 ఏళ్లు వచ్చేసరికీ సంపదను పెంచుకునే చర్యలను వేగవంతం చేసుకోవాలి. దాని కోసం పెట్టుబడులను పెంచాలి. ముందుగా కనీసం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల ఖర్చులకు సరిపడే డబ్బులను ఉంచుకోవాలి. ఇల్లు కొనుగోలు చేయాలంటే దాదాపు 40 శాతం డౌన్ పేమెంట్ మీ వద్ద ఉండాలి. భాగస్వామితో కలిసి రుణం తీసుకుంటే, ఈఎంఐలను సమానంగా జమ చేయాలని నిర్ణయించుకోవాలి. అలాగే మీపై ఆధార పడిన తల్లిదండ్రుల బాధ్యతలు తీసుకోవాలి. వారికి ఆరోగ్య బీమా తీసుకోవాలి. పిల్లల చదువులు, ఉద్యోగ విరమణ ప్రణాళికలను రూపొందించుకోవాలి. వీటి కోసం మీ ఆర్థిక ప్రణాళికాదారుడిని సంప్రదించాలి. దీర్ఘకాలిక లక్ష్య విలువలు చాలా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి మీ కార్పస్ లో దాదాపు 30 శాతం ఈక్విటీ కేటాయింపు ఉండేలా చూసుకోవాలి.
40 ఏళ్ల వయసు వచ్చిన సంపదన పెంచుకునే మరిన్ని మార్గాలను ఆలోచించాలి. ఉద్యోగ విరమణ వయసు 50 ఏళ్లు అయితే రుణాలను తీసుకోవడం మానివేయాలి. సాధ్యమైనంత పొదుపు పెంచుకుంటూ వెళ్లాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే పొదుపు చేయడంలో తోటి వారితో పోటీ పడనవసరం లేదు. మీకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లల చదువు, వివాహాల ఖర్చులు మీ పదవీ విరమణ కార్పస్ ను తగ్గిస్తాయి. కాబట్టి పక్కాగా ఆర్థిక ప్రణాళికలు అమలు చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి