Edible Oil Prices: దేశంలో ఆహార పదార్థాలపై ద్రవ్యోల్బణం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నిత్యం పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా పండగలకు ముందే ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు చమురు ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వం.. వంట నూనెల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ సెక్రటరీతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. ఈ మేరకు ధరలు తగ్గించాలని ప్రభుత్వం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. మరో రెండు వారాల్లో ధరలను రూ.10 తగ్గించాలని చమురు కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ ధరల పతనం మధ్య వంట నూనెల రిటైల్ ధరలను మరింత తగ్గించే అవకాశాలపై చర్చించడానికి ఆహార మంత్రిత్వ శాఖ గత నెలలో వంటనూనె తయారీదారులు, వాణిజ్య సంస్థల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మే నెల తర్వాత ప్రభుత్వం కంపెనీల ప్రతినిధులతో మూడు సార్లు చర్చలు జరిపింది.
వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా..
వాస్తవానికి పామాయిల్‌ను అత్యధికంగా ఎగుమతి చేసే ఇండోనేషియా ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత పొద్దుతిరుగుడు, సోయా నూనెల సరఫరా సులభమైంది. ఈ కారణంగా, గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. పరిశ్రమల ప్రయోజనాలను వినియోగదారులకు సైతం అందించాల్సి ఉంటుందని ఆహార మంత్రిత్వ శాఖ వర్గాలు ఎఫ్‌ఈకి తెలిపాయి. ఈ తరుణంలోనే వంట నూనెల రిటైల్ ధరలను మరింత తగ్గించే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు. భారత్ తన వార్షిక ఎడిబుల్ ఆయిల్ వినియోగంలో 56 శాతం దిగుమతుల ద్వారానే ఆధారపడుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధర తగ్గించాయి.
గత నెలలో.. ఆహార, ప్రజా పంపిణీ శాఖ, ఎడిబుల్ ఆయిల్ తయారీదారులు మరియు వర్తక సంఘాలతో జరిగిన సమావేశంలో గ్లోబల్ ధరలు తగ్గుతున్న దృష్ట్యా లీటరుకు కనీసం రూ.15 తగ్గించాలని కంపెనీలను కోరింది. అయితే.. తాజా ఆదేశాలతో కంపెనీలు లీటర్ నూనెపై రూ.10 నుంచి 12 వరకు తగ్గించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..