
కేంద్ర బడ్జెట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం ప్రణాళికలు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2026 నుంచే వీటి నిర్మాణం మొదలుపెట్టేందుకు భారత రైల్వేలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఖచ్చితమైన వ్యయ అంచనాల కోసం డీపీఆర్‌ను మార్చుతున్నాయి. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లు దేశంలోని ప్రధాన నగరాలను కలపనుండగా.. దాదాపు 4 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. వీటి వల్ల పెట్టుబడులు కూడా పెరిగి ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.
దేశ ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ప్యాసింజర్ సేవల నమూనాను మార్చేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే వందే భారత్, వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించగా.. త్వరలో బుల్లెట్ రైళ్లను కూడా ప్రవేశపెట్టనుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో రైల్వే నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల రాకతో రాత్రిపూట ప్రయాణం మరింత మెరుగవ్వగా.. సామాన్యుల కోసం అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో మరింత వేగవంతమైన ప్రయాణం అందించేందుకు ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్లను కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం వీటి డీపీఆర్‌లను ఖరారు చేసే ప్రక్రియ చేపడుతోంది. అనంతరం టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నారు. తొలి కారిడార్‌ను అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తోంది. వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
బుల్లెట్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. హైదరాబాద్-పుణె మార్గం మహారాష్ట్ర, తెలంగాణను కలుపుతుంది. 2 గంటల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది. ప్రయాణికులతో పాటు ఆర్ధిక వ్యవస్థ కూడా ఈ లైన్ వల్ల మెరుగుపడనుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు రైలు కారిడార్ ఏపీ మీదుగా కర్ణాటక వరకు ఉంటుంది. ఇది కర్ణాటక, తెలంగాణ, ఏపీలో ఐటీ, తయారీ, సేవా పరిశ్రమలకు ఉపయోగపడనుంది. రెండు గంటల ప్రయాణం సమయం దీని వల్ల తగ్గుతుంది. ఇక హైదరాబాద్-చెన్నై కారిడార్ ప్రయాణ సమాయాన్ని దాదాపు గంట 13 నిమిషాలకు తగ్గిస్తుంది. దక్షిణ భారతేదేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను ఇది బలోపేతం చేస్తుంది. వీటి నిర్మాణంతో హైదరాాబాద్ రైల్వేలకు హాబ్‌గా మారనుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు కొత్త కంపెనీలు రానున్నాయి. వీటి వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగనుంది.