
ప్రస్తుతం యువతలో ఉద్యోగాలకంటే స్వయం ఉపాధి వైపు ఆసక్తి పెరుగుతోంది. స్థిరమైన ఆదాయం, భవిష్యత్ భద్రత కోసం చాలా మంది సొంత వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాన్ని ఎంపిక చేసుకోవడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగంలో ఎప్పటికీ డిమాండ్ ఉండే సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ యువతకు మంచి అవకాశంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, ప్రభుత్వ నిర్మాణ పనులు, గ్రామీణ గృహ నిర్మాణ పథకాలు వేగంగా పెరుగుతున్న కారణంగా సిమెంట్ ఇటుకలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా సంప్రదాయ ఎర్ర ఇటుకలతో పోలిస్తే సిమెంట్ ఇటుకలు బలంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో లభిస్తాయి. దీంతో కాంట్రాక్టర్లు, బిల్డర్లు కూడా వీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ఈ పరిశ్రమను ప్రారంభించడానికి ప్రధానంగా మిక్సర్, వైబ్రేటర్, వివిధ రకాల అచ్చులు (మోల్డ్స్), అలాగే ఇటుకలను నిల్వ చేసి ఆరబెట్టేందుకు ఖాళీ స్థలం అవసరం అవుతుంది. మొత్తం సెటప్ కోసం సుమారు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవసరమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక సిమెంట్ ఇటుక తయారీకి సుమారు రూ.10 వరకు ఖర్చవుతుంది. మార్కెట్లో అదే ఇటుక రూ.12 నుంచి రూ.15 వరకు విక్రయించవచ్చు. అంటే ఒక్క ఇటుకపై రూ.2 నుంచి రూ.5 వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది. రోజువారీ ఉత్పత్తి, అమ్మకాల ఆధారంగా నెలకు కనీసం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తున్నారు. వ్యాపారం విస్తరించిన కొద్దీ ఈ ఆదాయం లక్షల్లోకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తెలంగాణలో టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాల ద్వారా సబ్సిడీలు లభిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో పీఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ పథకాల కింద రుణాలు, సబ్సిడీలు అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే వారు ఆధార్, పాన్, ప్రాజెక్ట్ రిపోర్ట్, స్థల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంట్ ఇటుకల వ్యాపారం యువతకు లాభదాయకమైన స్వయం ఉపాధి అవకాశంగా మారుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి