
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిబంధనల ప్రకారం.. తడిసిన, చిరిగిన లేదా పాడైపోయిన నోట్ల మార్పిడికి సంబంధించి చాలా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. మరి మీ వద్ద ఉన్న డ్యామేజ్ నోట్లకు పూర్తి డబ్బులు వాపస్ వస్తాయా? లేక సగం విలువ మాత్రమే ఇస్తారా? అనే ఆర్‌బీఐ నిబంధనలను తెలుసుకుందాం.
1. బ్యాంకులు కచ్చితంగా నోట్లను మార్చాలి:
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినా సరే తమ వద్దకు వచ్చే కస్టమర్ల తడిసిన, పాతబడిన లేదా చిరిగిన నోట్లను తీసుకోవడానికి నిరాకరించకూడదు.
కస్టమర్లకు సేవలు అందించే కౌంటర్ల వద్ద ఈ నోట్లను మార్చుకునే సదుపాయాన్ని బ్యాంకులు ఉచితంగా కల్పించాలి. దీని కోసం సదరు బ్యాంక్ ఖాతాదారులై ఉండాల్సిన అవసరం కూడా లేదు.
2. తడిసిన, కాలిపోయిన నోట్ల మార్పిడి:
నోట్లు పూర్తిగా నీటిలో తడిసిపోయి, ఒకదానికొకటి అంటుకుపోయి విడదీయడానికి వీలు లేకుండా ఉన్నా లేదా స్వల్పంగా కాలిపోయినా సాధారణ బ్యాంక్ శాఖలు వాటిని నేరుగా మార్చలేవు.
ఇటువంటి నోట్లను కేవలం ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ ఆఫీస్ వద్ద మాత్రమే సమర్పించాలి. అక్కడ నిపుణులు వాటి స్థితిని బట్టి విలువను లెక్కిస్తారు.
3. ఎంత శాతం చిరిగితే ఎంత డబ్బు వస్తుంది?:
నోటు ఎంత భాగం సురక్షితంగా ఉందనే దానిపై మీకు వచ్చే రీఫండ్ ఆధారపడి ఉంటుంది:
ఫుల్ రీఫండ్: ఒకవేళ చిరిగిన నోటు వైశాల్యం కనీస పరిమితి కంటే ఎక్కువగా ఉంటే మీకు పూర్తి విలువ చెల్లిస్తారు. ఉదాహరణకు, రూ. 2000, రూ. 500, రూ. 200 లేదా రూ. 100 నోట్లలో దాదాపు 80 శాతం కంటే ఎక్కువ భాగం సురక్షితంగా ఉంటే పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయి.
హాఫ్ రీఫండ్ : ఒకవేళ నోటు సగానికి పైగా చిరిగిపోయి, దాని వైశాల్యం 40 శాతం నుండి 80 శాతం లోపు మాత్రమే ఉంటే.. బ్యాంకులు మీకు ఆ నోటు అసలు విలువలో సగం డబ్బును మాత్రమే చెల్లిస్తాయి. అంతకంటే తక్కువగా ఉంటే ఆ నోటు చెల్లదు.
4. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చబడని నోట్లు:
తీవ్రంగా కాలిపోయిన, బూడిదగా మారిన లేదా పూర్తిగా బొగ్గులా మారిన నోట్లను బ్యాంకులు అంగీకరించవు.
నోటుపై ఉద్దేశపూర్వకంగా రాసిన రాతలు, రాజకీయ నినాదాలు, మతపరమైన చిత్రాలు లేదా ఏదైనా గుర్తులు ఉంటే ఆ నోట్లు విలువ కోల్పోతాయి. అలాంటి నోట్లను బ్యాంకులు మార్చవు. అలాగే నోటుపై సీరియల్ నెంబర్ లేకపోయినా మార్పిడి చేయడం కుదరదు.
కాబట్టి మీ వద్ద చిరిగిన లేదా తడిసిన నోట్లు ఉంటే దలారులను ఆశ్రయించి నష్టపోకుండా, నేరుగా సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం సులభంగా మార్చుకోవచ్చు.
గమనిక:
ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అధికారిక నోట్ మార్పిడి నిబంధనలు మరియు మార్గదర్శకాల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. మీ నోట్ల మార్పిడిపై తుది నిర్ణయం సదరు బ్యాంక్ అధికారి పరిశీలన మరియు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.