బిస్లరీ వాటర్ తాగుతున్నారా..? మరోసారి పరీక్షల్లో బయటపడ్డ నిజాలు.. అసలు ఏం తేలిందంటే..?

బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్ల అంశం వివాదాస్పదంగా మారింది. బిస్లరీ వాటర్ సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) తేల్చిచెప్పింది. బిస్లరీ అప్పీల్ చేయగా.. మళ్లీ ల్యాబ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో కూడా సురక్షితం కాదని తేలింది.

బిస్లరీ వాటర్ తాగుతున్నారా..? మరోసారి పరీక్షల్లో బయటపడ్డ నిజాలు.. అసలు ఏం తేలిందంటే..?
Bisleri

Updated on: Nov 23, 2026 | 8:16 AM

“బిస్లరీ వాటర్” సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టం చేసింది. బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలు పరీక్షించిన FSSAI.. బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్‌లో పరిమితికి మించి బ్రోమైట్ ఉన్నట్లు వెల్లడించింది. బిస్లరీ కంపెనీ అప్పీల్ చేయడంతో ఫుడ్ ల్యాబ్‌లో మరోసారి పరీక్షలు జరిపారు. ల్యాబ్ పరీక్షల్లో నీటిలో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు గుర్తించారు. బిస్లరీ వాటర్ విషయంలో ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధరణ అయింది. మంచి నీటి వాటర్ బాటిళ్ల బిజినెస్‌లో బిస్లరీ అగ్రస్థానంలో ఉంది. చాలామంది తరచూ ఈ బ్రాండ్ నీటిని తాగుతుంటారు. ఇప్పుడు వాటర్ నాణ్యత సరిగ్గా లేదని, సురక్షితం కాదని వార్తలు రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

ప్రస్తుతం బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్ల తయారీ జరుగుతోంది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ నమూనా సురక్షితం కాదని తేలింది. దీంతో ఆ సంస్థపై విచారణకు భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ అనుమతి మంజూరు చేసింది. బిస్లరీ ప్రాంగణం నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలు సేకరించి ల్యాబుల్లో పరీక్షలు నిర్వహించామని, కానీ నిర్దేశిత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలిందని FSSAI తెలిపింది. నిర్దేశిత బ్రోమేట్ పరిమితులకు అనుగుణంగా లేదని స్పష్టం చేసింది. FSS చట్టం, 2006 ప్రకారం దీనిని అసురక్షితమైనదిగా ప్రకటించినట్లు ఆదివారం FSSAI తెలిపింది. బిస్లరీ కంపెనీతో పాటు వసంత మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మిమాన్సా ఇండస్ట్రీస్, ఆశా కన్ఫెక్షనరీ కంపెనీలపై కూడా విచారణకు అనుమతి మంజూరు చేసింది. అలాగే ఊర్మి లైఫ్‌సైన్సెస్ LLP, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ లైసెన్సులను కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఆహార, డ్రింకింగ్, కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీలపై FSSAI నిఘా పెంచింది. దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతోంది. ఇటీవల రెడ్ బుల్‌ “ఎనర్జీ డ్రింక్” అంశంపై వివాదం నడుస్తోంది. చక్కెర ఎక్కువగా ఉపయోగిస్తున్నందున వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈ లేబుల్ వాడకానికి వ్యతిరేకంగా FSSAI చర్యలు చేపట్టింది. అయితే తమకు ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఈ ఆంక్షలు విధించారంటూ రెడ్ బుల్, పెప్సికో, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్ కన్స్యూమర్ సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో “ఎనర్జీ డ్రింక్” లేబుల్‌ను ఉపయోగించడం కొనసాగించడానికి అనుమతిస్తూ రెడ్ బుల్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వివాదం జరుగుతన్న వేళ ఇప్పుడు బిస్లరీలో నాణ్యత అంశం కూడా హాట్‌టాపిక్‌గా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us