
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడేవారికి బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఇది పూర్తి చేయడం తప్పనిసరి చేసింది. గ్యాస్ సిలిండర్లలో అక్రమాలను అరికట్టి పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర సహాజ వాయువు మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నవారైనా సరే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే గ్యాస్ కనెక్షన్ రద్దు కావడంతో పాటు ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీలు ఆగిపోయే ప్రమాదముంది. గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అలాగే గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నవారికి ప్రభుత్వాలు బ్యాంకు అకౌంట్లలో జమ చేసే సబ్సిడీ సొమ్ము నిలిచిపోయే ప్రమాదముంది.
-https://pmuy.gov.in/index.aspx వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
-హోమ్ పేజీలో కేవైసీ అనే ఆప్షన్ ఎంచుకోండి
-మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
-ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి
-మీ ఏజెన్సీ యాప్‌లోకి మీ గ్యాస్ కనెక్షన్‌కు అందించిన మొబైల్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి
-ఈకేవైసీపై క్లిక్ చేయండి
-ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇచ్చి ఈకేవైసీ పూర్తి చేయండి
మీ ఇంటికి గ్యాస్ అందించడానికి వచ్చే డెలివరీ బాయ్ దగ్గర మెషీన్ ఉంటుంది. ఈ మెషీన్‌లో మీ బయోమెట్రిక్ వివరాలు అందించి ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. అలాగే మీరు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డు అందించి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 18002333555కు కాల్ చేయండి
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేయించుకోకపోతే అనేక సమస్యలు ఎదర్కొంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 శాతం మంది ఈకేవైసీ పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగిలిన 25 శాతం మంది వినియోగదారులు కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి చేయకపోతే గ్యాస్ సరఫరాలో సమస్యలు రావచ్చు. అలాగే ఏపీ ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుండగా.. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఈ నగదును లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఈ నగుదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఈ గ్యాస్ సబ్సిడీలకు నిలిచిపోవచ్చు.