
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ ను అందిపుచ్చుకోడానికి అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రకరకాల వేరియంట్లు, ఫీచర్లతో వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. అనువైన బడ్జెట్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల శ్రేణిలో ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ బీగాస్ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతీయ ఆటో మార్కెట్ కు పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. దాని పేరు బీగాస్ ఆర్‌యూవీ350. అంతేకాక భారతదేశంలో ఆర్‌యూవీ తరహాలో వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదేనని కూడా బీగాస్ ప్రకటించుకుంది. ప్రస్తుతం బీగాస్ నుంచి సీ12 మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉండగా.. ఈ ఆర్‌యూవీ350 రెండో మోడల్. సీ12 స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ సీ 12 స్కూటర్ రూ. 1.12లక్షల(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతోంది. కాగా బీగాస్ ఆర్‌యూవీ350 స్కూటర్ లో ప్రత్యేకతలేంటి? దాని లాంచింగ్ తేదీ ఏది? ధర ఎంత వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీగాస్ ఆర్‌యూవీ350 స్కూటర్ ను ఈ నెల 25న లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. కాగా భారతదేశంలో మొట్టమొదటి ఆర్‌యూవీ అని బీగాస్ క్లయిమ్ చేసుకున్న నేపథ్యంలో అసలు ఆర్‌యూవీ అంటే ఏమిటి? అని పరిశీలిస్తే.. ఆర్‌యూవీ అంటే రిక్రియేషనల్ యుటిలిటీ వెహికల్. ఇది చాలా స్టైలిష్ డిజైన్లో ఉంటుంది. అత్యాధునిక సాంకేతికత దీనిలో ఉంచుతారు. దీనిలో రైడర్లకు మంచి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అయితే ఈ ఆర్‌యూవీ350 స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు.
బీగాస్ ఆర్‌యూవీ350 స్కూటర్ కు సంబంధించిన ఇతర ఏ విషయాలు వెల్లడిచేయకపోయినా ప్రస్తుతం ఉన్న సీ12 స్కూటర్ కన్నా అధిక రేంజ్ లోనే బ్యాటరీ ప్యాక్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే బ్యాటరీ చార్జింగ్ టైంలో కూడా అప్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ బీగాస్ కంపెనీకి 40,000 రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 125 షోరూమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన శ్రేణిలో ప్రధానంగా ఓలా ఎలక్ట్రిక్, ఏథర్, టీవీఎస్, హీరో వంటి బ్రాండ్లకు పోటీగా ఈ కంపెనీ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. రానున్న రోజుల్లో మరింత కొత్త ఉత్పత్తులు ఈ కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..