Banks Festival Offers: పండుగ సీజన్ మొదలైంది. ఇప్పుడు ప్రజల కోరికలు తీర్చుకునే పనిలో పడ్డారు. కొద్దిగా దాచుకుని.. మరికొద్దిగా అప్పు అంటే లోన్ తీసుకుని తమ చిరకాల కోరికలు తీర్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. కొంతమందికి కారు కల కావచ్చు.. మరి కొంతమందికి ఎంతో కాలంగా ఊరిస్తున్న సొంత ఇల్లు కావచ్చు. మరి కొందరికి మంచి స్మార్ట్ టీవీ.. ఇంకొందరికి ఫ్రిడ్జ్ ఇలా ఎదో ఒక కోరిక ఉంటూనే ఉంటుంది. అటువంటి వారంతా పండుగ సమయంలో కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్స్.. ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవాలని తాపత్రయ పడతారు.
పండగ సీజన్‌లో తమ కలను సాకారం చేసుకునేందుకు ప్రజలు రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఇప్పుడు బ్యాంకులకు ఇటువంటి లోన్స్ కోసం వచ్చే డిమాండ్ బాగా పెరిగింది. దీంతో బ్యాంకుల్లో క్యాష్ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పుడు బ్యాంకుల మధ్యలో డబ్బు డిపాజిట్ చేసేవారిని ఆకర్షించుకునే పోటీ బాగా పెరిగింది. ఈ పోటీ ప్రజలకు మేలు చేసేదిగా మారింది. ఎలా అంటారా.. మా బ్యాంకులో ఇన్వెస్ట్ చేయండి.. వడ్డీ శాతం కాస్త ఎక్కువ ఇస్తాం అని ప్రచారం మొదలు పెట్టాయి బ్యాంకులు.
కొత్త సేవింగ్స్ ఎకౌంట్ తెరవడానికి బ్యాంకులు గరిష్ఠంగా ప్రస్తుతం 7.5% వరకు వడ్డీని అందజేస్తున్నాయి. అలాగే ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 8.07%కి చేరుకుంది. ఎంపిక చేసిన రూపే డెబిట్ కార్డులపై సప్లిమెంటరీ లాంజ్, ప్రీమియం హెల్త్ చెకప్, ప్రయాణ – వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ కూడా ఉచితంగా అందిస్తున్నారు. సగటున దేశంలో సేవింగ్స్ ఎకౌంట్స్ పై వడ్డీ 2.5-5% గా ఇప్పటివరకూ ఉంది. అలాగే FD రేటు కూడా ఐదేళ్లుగా 7% కంటే మించి లేదు. కానీ RBI చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు 6 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. దీన్ని ఎదుర్కొనేందుకు డిపాజిట్ల పెంపుపై ఆయా బ్యాంకులు దృష్టి సారిస్తున్నాయి.
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలోని కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు..
మాక్సిమా సేవింగ్స్ ఖాతా: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో కొత్త సేవింగ్స్ ఖాతాలో పొదుపు మొత్తంపై 7.5% వడ్డీ ఇస్తున్నారు. కనీసం లక్ష రూపాయలతో ఎకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఫెడరల్ బ్యాంక్: 13 నెలల ఫిక్సిడ్ డిపాజిట్‌పై సాధారణ పెట్టుబడిదారులకు 7.57% వడ్డీ రేటును ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 8.07% వడ్డీ రేటును అందిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై సంవత్సరానికి 3.50% నుండి 8.05% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.
డెబిట్ కార్డ్ ఆఫర్లు: కొన్ని బ్యాంకులు ఈ రూపే కార్డుతో ప్రీమియం హెల్త్ చెకప్, ట్రావెల్ కూపన్‌లు, వ్యక్తిగత ప్రమాద బీమా వంటి ఆఫర్‌లను అందిస్తున్నాయి.
దీంతో మొదటి సరిగా సేవింగ్స్ ఎకౌంట్, బ్యాంక్ FD ఇప్పుడు టాప్-5 స్వల్పకాలిక పెట్టుబడులలో ఉన్నాయి. ఈక్విటీ ఫండ్ సంవత్సరానికి 7-15% రాబడిని అందిస్తున్నాయి. కార్పొరేట్ FD 6-12% సంవత్సర వడ్డీని అందిస్తోంది. ఇక లోన్ ఫండ్ 6-9%, బ్యాంక్ FD 3.5 – 8.07%, సేవింగ్స్ ఎకౌంట్ 3 – 7.% వడ్డీ అందిస్తున్నాయి.
ఇప్పుడు డబ్బులు చేతిలో ఉండి.. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనీ అనుకునే వారు.. సురక్షితమైన బ్యాంకింగ్ రంగంలో వడ్డీ రేటుపై బేరం ఆడి మరీ డిపాజిట్ చేయగలిగే అవకాశం వచ్చింది. మరి మీ దగ్గర అలా ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటె వెంటనే చేసేయండి.. ఇంతకంటే మంచి సమయం దొరకదు.
మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ కథనాలు చదవండి..