
ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఎవరి చేతుల్లో చూసినా ఏదొక బ్యాంక్ కార్డు కనిపిస్తుంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో పాటు రివార్డ్ పాయింట్ల కోసం వీటిని ఎక్కువమంది వాడుతున్నారు. ఈ-కామర్స్ వెబ్ సైట్లలో భారీ డిస్కౌంట్లు, నో కాస్ట్ ఈఎంఐ లాంటి సౌకర్యాలు వీటిపై అందిస్తున్నారు. దీంతో వీటి కోసం చాలామంది క్రెడిట్ కార్డులను తీసుకుంటున్నారు. కొంతమంది రెండు, మూడు బ్యాంకుల క్రెడిట్ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమందికి వీటిని ఎలా వాడాలో తెలియక నష్టపోతున్నారు. ఎలా పడితే అలా వాడి సమయానికి బిల్లులు కట్టలేక అప్పులపాలవుతున్నారు. అయితే క్రెడిట్ కార్డుల ద్వారా కొన్ని లావాదేవీలు అసలు చేయకూడదు. ఒకవేళ మీరు చేస్తే భారీగా ఫీజులను కట్టాల్సి ఉంటుంది.
అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు కొంతమంది ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారు. ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు విధిస్తారు. డబ్బులు విత్ డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ పడుతుంది. ఏటీఎం నుంచి మీ క్రెడిట్ కార్డు లిమిట్‌లో 20 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మీ కార్డు లిమిట్ రూ.లక్ష ఉంటే రూ.20 వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. ఇక మిగతా లిమిట్‌ను ఇతర విధానాల్లో విత్ డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసినప్పుడు అడ్వాన్స్ ఫీజుతో పాటు విత్ డ్రా చేసిన మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఛార్జీలు ఉండవు. ఒక్కొ బ్యాంకులో ఒక్కొలా ఈ ఛార్జీలు అనేవి ఉంటాయి.
యాక్సిస్ బ్యాంక్ విత్ డ్రా చేసిన మొత్తంలో 2.5 శాతం, కనీసం రూ.500 క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు వసూలు చేస్తోంది. నెలకు 1.05 శాతం నుంచి 3.60 శాతం వరకు వడ్డీ విధిస్తుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.5 శాతం లేదా రూ.500 విత్ డ్రా ఛార్జీలతో పాటు నెలకు 1.99 శాతం నుంచి 3.6 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ విత్ డ్రా చేసిన మొత్తంలో 2.5 శాతం లేదా కనిష్టంగా రూ.500 క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు వసూలు చేస్తుండగా.. నెలకు 2.49 శాతం నుంచి 3.67 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఇక ఎస్బీఐ 2.5 శాతం లేదా రూ.500 ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని క్యాష్ అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తుండగా.. నెలకు 2.75 శాతం నుంచి 3.50 శాతం వరకు వడ్డీ విధిస్తుంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ ప్రతీ రూ.10 వేలకు రూ.300 క్యాష్ అడ్వాన్స్ ఛార్జీలు వసూలు చేస్తూండగా.. నెలకు 2.49 శాతం నుంచి 3.50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది.