ED విచారణకు అనిల్ అంబానీ..! ఏకంగా రూ.15,700 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసు లో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన ముంబైలోని ఇంటిని రూ.3,716 కోట్ల విలువతో ఈడీ అటాచ్ చేసింది. RCOM బ్యాంకు రుణ మోసం కేసు లో PMLA కింద దర్యాప్తు కొనసాగుతోంది.

ED విచారణకు అనిల్ అంబానీ..! ఏకంగా రూ.15,700 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
Anil Ambani Ed

Updated on: Feb 26, 2026 | 1:59 PM

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్‌ అంబానీ గురువారం మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ కార్యాలయం ముందు హాజరయ్యారు. అత్యున్నత ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఆయన ముంబైలోని ఇంటిని రూ.3,716 కోట్ల విలువతో అటాచ్ చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆసియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ తమ్ముడు అయిన అనిల్ అంబానీకి ఒకప్పుడు భారీ వ్యాపార సామ్రాజ్యం ఉండేది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఆయన సంపద గణనీయంగా తగ్గింది. ఇటీవలి కాలంలో బ్యాంకు రుణాల మళ్లింపు, మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఆయనపై దృష్టి సారించాయి.

Reliance Communications (RCOM) కు సంబంధించిన బ్యాంకు రుణ మోసం కేసులో భాగంగా 66 ఏళ్ల వ్యాపారవేత్త రెండో విడత విచారణకు హాజరయ్యారు. ముంబై పాలి హిల్ ప్రాంతంలోని ఆయన విలాసవంతమైన నివాసం ‘అబోడ్’ 17 అంతస్తులతో, సుమారు 66 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఈ ఆస్తిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ తెలిపింది. ఇదే ఆస్తిలో రూ.473.17 కోట్ల విలువైన భాగాన్ని 2025 నవంబర్‌లోనే ఈడీ అటాచ్ చేసింది.

RCOM, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుంచి మొత్తం రూ.40,185 కోట్ల రుణాలు పొందినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తు సమయంలో నిందితులు ఆస్తులను అమ్మడం లేదా బదిలీ చేయకుండా నిలువరించేందుకు తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్ జారీ చేస్తారు. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరింది. అనిల్ అంబానీ మొదట ఆగస్టు 2025లో ఈడీ ఎదుట విచారణకు హాజరై, PMLA కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్‌పై బ్యాంకు మోసం, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన పలు కేసులను దర్యాప్తు చేయడానికి ఈడీ ఇటీవల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us