
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పవిత్రమైన గోవర్ధన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మథురలోని వృందావనానికి వచ్చారు. దారి పొడవునా భక్తులు, స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ముందు శ్రీ గిరిరాజ్ జీ ముఖారవింద ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం గిరిరాజ్ జీగా పిలిచే గోవర్దన పర్వతానికి ప్రదక్షిణలు చేశారు. అనంత్ అంబానీ ప్రదక్షిణలు చేసుకుంటూ ముందుకు వెళ్తుండగా భక్తులంతా సంప్రదాయ పద్ధతిలో ఆయన స్వాగతం పలికారు. ప్రదక్షిణ దారిలో బ్రజ్ ప్రాంతపు సంస్కృతి, భక్తి భావం దర్శనమిచ్చాయి. అలాగే స్థానిక కళాకారులు శ్రీకృష్ణుడి లీలలను ప్రదర్శించారు. ఆధ్యాత్మిక వాతావరణం, సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు స్థానికులు చూపించారు. ఈ ప్రదర్శనలను చూస్తూ అనంత్ అంబానీ ఒక్కసారిగా మైమరచిపోయారు.
గోవర్దన గిరి ప్రదక్షిణ, స్థానికుల ఆధ్మాత్మిక ప్రదర్శనల గురించి అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “నేను గిరిరాజ్ ధరణ్ పూర్తి ప్రదక్షిణ చేస్తున్నాను. గిరిరాజ్ ధరణ్ స్వామి పాదాల చెంత ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. బ్రజ్ ప్రజల ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మనమందరం ఇక్కడ స్వామి పాదాల దగ్గర ఉన్నాము. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా తాతయ్య, నానమ్మలే. వారి ఆశీర్వాదం, ప్రేమ, వాళ్లు చూపిన దారే నన్ను ఇక్కడికి నడిపించాయి. నేను పూర్తి ప్రదక్షిణ చేయడానికి వస్తున్నానని చెప్పినప్పుడు వాళ్లు ఎంతో సంతోషించారు. వాళ్ల తరపున కూడా నేను ఇక్కడ స్వామికి నా మొక్కులు తీర్చుకుంటున్నాను. ఇక్కడ నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇక్కడ ఒక ప్రత్యేకమైన భక్తి, ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నా. ముఖ్యంగా మన భారతదేశం ఎంతో బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను” అని అనంత్ అంబానీ తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ గిరిరాజ్ జీ ముఖారవింద ఆలయ పూజారి గణేష్ మాట్లాడుతూ.. “అనంత్ అంబానీ గిరిరాజ్ జీని దర్శించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన తల్లిదండ్రులకు, తాతయ్య, నానమ్మలకు కూడా గిరిరాజ్ జీతో మొదటి నుంచి ఎంతో అనుబంధం ఉంది. వాళ్లు ఇక్కడి అన్ని ఆలయాలకు ఎప్పుడూ విరాళాలు, కానుకలు ఇస్తూనే ఉంటారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి పేరు, ఐశ్వర్యం కలగాలని ఆశీర్వదిస్తున్నాను” అని పేర్కొన్నారు.