బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలకు (ఎఫ్ డీలు) ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. డబ్బులు పెట్టుబడి పెట్డడానికి అత్యంత నమ్మకమైన మార్గాలుగా వాటిని భావిస్తారు. నిర్ణీత కాలానికి వడ్డీతో సహా అసలు తీసుకునే అవకాశం, డబ్బులకు పూర్తి భద్రత ఉండడం దీనికి ప్రధాన కారణం. ఎఫ్ డీలపై వడ్డీరేట్లు బ్యాంకుల వారీగా మారుతూ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు సాధారణ ఖాతాదారులకంటే ఎక్కువ వడ్డీ అందిస్తాయి. అయితే ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేక ఎఫ్ డీలలో పెట్టుబడి పెట్టే గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ అందించే ప్రత్యేక వడ్డీరేటు, నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి సెప్టెంబర్ 30 చివరి తేదీ. ఆ తర్వాత ఈ పథకాలను ఆపివేయనున్నారు. వీటి ద్వారా 300 నుంచి 444 రోజుల కాలవ్యవధిలో ఏడాదికి 7.05 నుంచి 7.35 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సురక్షితమైన, రాబడి కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇవి సాధారణ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ ఆఫర్ చేస్తాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి రేట్లు తగ్గించడం ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చాలా మంది సీనియర్ సిటిజన్లు, రిస్క్ కోరుకోనివారు తమ పెట్టుబడులపై స్థిరమైన రాబడిని పొందడం కోసం ఎఫ్ డీలపై ఆధార పడతారు. అధిక వడ్డీలు ఇచ్చే ఎఫ్ డీలు ముగియనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆలోచన చేయాలి. ప్రస్తుత అధిక వడ్డీ రేట్లతో మీ ఇన్వెస్ట్‌మెంట్‌లను లాక్ చేసుకోవాలి. తద్వారా ఈ ప్రత్యేక ఎఫ్ డీల నుంచి ప్రయోజనం పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి