గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్.. కొత్త రేట్లు ఇవే

పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి గ్యాస్ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని పారిశ్రామిక వినియోగదారులకు బదిలీ చేస్తూ అదనపు సహజ వాయువు ధరలను భారీగా తగ్గించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ, పరిశ్రమలపై భారం తగ్గించడమే లక్ష్యంగా కంపెనీ ఈ సవరణ చేపట్టింది.

గుడ్ న్యూస్.. గ్యాస్ ధరలను భారీగా తగ్గించిన ఆదానీ గ్రూప్.. కొత్త రేట్లు ఇవే
Adani Total Gas Slashes Price For Certain Industrial Users

Updated on: Mar 15, 2026 | 5:35 PM

పారిశ్రామిక రంగానికి ఊరటనిస్తూ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. పారిశ్రామిక వినియోగదారులకు సరఫరా చేసే అదనపు సహజ వాయువు ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా అప్‌స్ట్రీమ్ గ్యాస్ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మార్చి 16, ఉదయం 6 గంటల నుండి అమలులోకి రానున్నాయి.

ధరల తగ్గింపు వివరాలు

పారిశ్రామిక వినియోగదారులు తమ కాంట్రాక్ట్ పరిమితికి మించి వాడే అదనపు గ్యాస్ ధరపై ఈ తగ్గింపు వర్తిస్తుంది.

  • పాత ధర: ప్రామాణిక క్యూబిక్ మీటర్‌కు రూ. 119.90
  • కొత్త ధర: ప్రామాణిక క్యూబిక్ మీటర్‌కు రూ. 82.95
  • తగ్గింపు: దాదాపు రూ. 36.95 మేర తగ్గింది.

తగ్గింపుకు కారణాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల భారతదేశానికి వచ్చే ఎల్‌ఎన్‌జీ సరఫరాలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు పారిశ్రామిక వినియోగదారులు తమ కాంట్రాక్ట్ వాల్యూమ్‌లో 40 శాతానికి వినియోగాన్ని తగ్గించుకోవాలని కంపెనీ గతంలోనే కోరింది. సరఫరా సవాళ్లు ఉన్నప్పటికీ, అప్‌స్ట్రీమ్ ధరలు తగ్గడంతో ఆ లాభాన్ని వినియోగదారులకు అందించాలని ATGL నిర్ణయించింది.
గ్యాస్ పంపిణీ సమానంగా జరగాలని, అదే సమయంలో సిస్టమ్ స్థిరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ధరల సవరణ చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది.

సామాన్యులపై ప్రభావం ఏంటి?

ఈ ధరల తగ్గింపు కేవలం పారిశ్రామిక, వాణిజ్య విభాగాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

CNG – వంట గ్యాస్ : అదానీ గ్యాస్ వాల్యూమ్‌లో 70 శాతం గృహ అవసరాలకు, వాహనదారులకే సరఫరా అవుతుంది. ఈ విభాగాల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

దిగుమతి చేసుకున్న గ్యాస్: మిగిలిన 30 శాతం దిగుమతి చేసుకున్న LNG ద్వారా వస్తుంది. దీనినే పరిశ్రమలకు కేటాయిస్తారు. ప్రస్తుత తగ్గింపు ఈ విభాగానికే వర్తిస్తుంది.

సరఫరాలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూనే, పరిశ్రమలకు భారం తగ్గించే దిశగా అదానీ-టోటల్ గ్యాస్ వేసిన ఈ అడుగు పారిశ్రామిక వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. దీనికి సంబంధించి గెయిల్ ఇండియా నుండి మరిన్ని స్పష్టతలు కోరినట్లు కంపెనీ తెలిపింది. దీనివల్ల భవిష్యత్తులో సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Follow Us