Adani Group: దేశంలోని సంపన్న వ్యాపార వేత్తగా ఉన్న గౌతమ్ అదానీని చెందిన అదానీ గ్రూప్ మరో భారీ డీల్ కుదుర్చుకుంది. గత కొంత కాలంగా అదానీ అనేక వ్యాపారాల్లోకి ప్రవేశిస్తూ.. వేగంగా వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఇదే సమయంలో.. సెంట్రల్ ఇండియాలో ఎస్సార్ పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. రూ. 1,913 కోట్లకు కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత్ లో అదానీ గ్రూప్ ఉనికి మరింత బలోపేతం కానుంది. ఈ డీల్ పవర్ ట్రాన్స్‌మిషన్ వ్యాపారం నుంచి ఎస్సార్ గ్రూప్ నిష్క్రమణను సూచిస్తోంది. ఎస్సార్ పవర్ లిమిటెడ్ తన రెండు పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు అమ్మేందుకు అంగీకరించింది. కంపెనీ రుణ చెల్లింపు వ్యూహంలో భాగంగా.. ఈ డీల్ జరుగుతోందని తెలుస్తోంది. గత మూడేళ్ల కాలంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు.. ఎస్సార్ సంస్థ రూ.1.8 లక్షల కోట్ల రుణాలను చెల్లించింది.
అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు తమ రెండు పవర్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రూ. 1,913 కోట్లకు విక్రయించడానికి ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎస్సార్ పవర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎస్సార్ పవర్ యూనిట్ అయిన ఎస్సార్ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ (ఈపీటీసీఎల్) మూడు రాష్ట్రాల్లో 465 కి.మీల విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను కలిగి ఉంది. కంపెనీ రుణాల చెల్లింపు, పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడి పెట్టే లక్ష్యంతో తన పవర్ సెగ్మెంట్‌ను తిరిగి బ్యాలెన్స్ చేస్తోందని ఎస్సార్ పవర్ సీఈవో కుష్ ఎస్ అన్నారు. ఎస్సార్ పవర్ ప్రస్తుతం భారత్, కెనడాలోని నాలుగు పవర్ ప్లాంట్లలో 2,070 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదానీ గ్రూప్ ఈ డీల్ కారణంగా దేశంలో తన ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను 19,468 సర్క్యూట్ కిలోమీటర్లకు విస్తరిస్తుంది. ఇందులో 14,952 సీకేఎంలు పనిచేస్తుండగా.. మిగిలిన 4,516 సీకేఎంలు వివిధ దశల్లో ఉన్నాయి.