8th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఏ, జీతం పెంపుపై కీలక అప్డేట్!

8వ కేంద్ర వేతన సంఘం పనులు వేగంగా సాగుతున్నాయి. 55 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, భత్యాల సవరణపై ఇది కీలక సిఫార్సులు చేయనుంది. ప్రస్తుతం 60 శాతం డీఏ ఉండగా, జూలై 2026 డీఏ పెంపు అంచనా.

8th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఏ, జీతం పెంపుపై కీలక అప్డేట్!
8th Pay Commission

Updated on: Jun 20, 2026 | 4:09 PM

8వ కేంద్ర వేతన సంఘం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2025 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఆమోదించిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ కమిషన్ సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, భత్యాల సవరణపై కీలక సిఫార్సులు చేయనుంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం (DA) 60 శాతంగా ఉంది. 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో 2 శాతం డీఏ పెంపును ప్రకటించింది. సాధారణంగా ప్రతి సంవత్సరం రెండు విడతల్లో డీఏ పెంపు ప్రకటించే కేంద్రం, జూలై 2026కు సంబంధించిన రెండో విడత డీఏను సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ప్రకటన అక్టోబర్ వరకు ఆలస్యం కావచ్చని చెబుతున్నారు.

డీఏ నిర్ణయానికి కార్మిక శాఖ విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (AICPI-IW) ఆధారంగా లెక్కలు వేస్తారు. ఏప్రిల్ 2026లో ఈ సూచిక 149.9కి చేరింది. మే, జూన్ నెలల డేటా ఆధారంగా జూలై 2026 డీఏ పెంపు శాతం ఖరారుకానుంది. కాగా 8వ వేతన సంఘానికి సూచనలు, వినతిపత్రాలు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 15, 2026ను చివరి తేదీగా నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, వివిధ విభాగాల ప్రతినిధులు తమ డిమాండ్లను కమిషన్‌కు అందజేశారు.

వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వాటాదారులతో నేరుగా సమావేశమవుతూ 8వ సీపీసీ అభిప్రాయాలు సేకరిస్తోంది. జూన్ 22-23 తేదీల్లో లక్నో, జూలై 6-7 తేదీల్లో భువనేశ్వర్, జూలై 9-10 తేదీల్లో కోల్‌కతాలో సమావేశాలు నిర్వహించనుంది. ఇప్పటికే ఢిల్లీ, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, హైదరాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో సంప్రదింపులు పూర్తి చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించి తుది సిఫార్సుల రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశముందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us