8th Pay Commission: కీలక అప్డేట్.. గడువుపై పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘంపై పార్లమెంట్‌లో కీలక వివరాలు వెల్లడించింది. 2025 నవంబర్ 3న ఏర్పడిన ఈ కమిషన్ కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, అలవెన్సులపై సిఫార్సులు చేస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణకు MyGov పోర్టల్ ద్వారా గడువు 2026 మార్చి 31 వరకు పొడిగించారు.

8th Pay Commission: కీలక అప్డేట్.. గడువుపై పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!
8th Pay Commission

Updated on: Mar 26, 2026 | 8:23 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కీలక పరిణామంగా 8వ కేంద్ర వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలను పార్లమెంట్‌లో వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ తరఫున లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు. ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆ తీర్మానం ప్రకారం కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాల్లో మార్పులను సూచించే అవకాశం ఉంది. అయితే వీటి అమలుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుందనేది తుది నిర్ణయం తర్వాతే స్పష్టతకు వస్తుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఈ కమిషన్ న్యూ ఢిల్లీలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. దీనికి మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాష్ దేశాయ్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుండగా, పులక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషన్ పనులను వేగవంతం చేయడానికి అదనపు సిబ్బందిని నియమించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

ఇక ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియలో భాగంగా 18-సూత్రాల ప్రశ్నావళికి స్పందనలు సమర్పించేందుకు గడువును ప్రభుత్వం పొడిగించింది. మొదట మార్చి 16గా ఉన్న గడువును ఇప్పుడు మార్చి 31, 2026 వరకు పెంచారు. అన్ని సూచనలు తప్పనిసరిగా MyGov పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రభావం చూపే ఈ వేతన సంఘం, ప్రస్తుతం సమాచార సేకరణ, విధాన రూపకల్పన దశలో ఉంది. తుది సిఫార్సులు వెలువడిన తర్వాతే జీతాలు, పెన్షన్లలో మార్పులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us