
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రూ.2,000 నోట్లను రద్దు చేసిన రెండు సంవత్సరాల తరువాత కూడా రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన అధికారిక డేటాలో ఇందుకు సంబంధించి సమాచారం అందించింది. ఈ రూ. 2000 నోట్లు ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయని, వంద శాతం ఇంకా తమ వద్దకు చేరలేదని తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న రూ.2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లుగా ఉండగా, మే 31, 2025న వ్యాపారం ముగిసే సమయానికి ఇది రూ.6,181 కోట్లకు తగ్గిందని RBI ప్రకటనలో తెలిపింది.
ఈ విధంగా మే 19, 2023 వరకు చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.26 శాతం తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకు శాఖలలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సౌకర్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 19 ఇష్యూ కార్యాలయాలలో మాత్రమే అందుబాటులో ఉంది.
RBI జారీ కార్యాలయాలు అక్టోబర్ 9, 2023 నుండి వ్యక్తులు, సంస్థల నుండి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి రూ. 2,000 నోట్లను స్వీకరిస్తున్నాయి. దీనితో పాటు ప్రజలు దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా రూ. 2,000 నోట్లను ఇండియన్ పోస్ట్ ద్వారా ఏ ఆర్బీఐ కార్యాలయానికైనా పంపి తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకోవచ్చు.
మార్కెట్లో ఇంకా చాలా నోట్లు ఉన్నాయి:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2000 రూపాయల నోట్లలో 98.26 శాతం తిరిగి వచ్చినప్పటికీ, రూ. 6,181 కోట్ల విలువైన 2000 నోట్లు ఇప్పటికీ మార్కెట్లో ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. 6,181 కోట్ల విలువైన ఈ 2000 రూపాయల నోట్ల సంఖ్య దాదాపు 3 కోట్లు. మీ దగ్గర కూడా రూ.2000 నోటు ఉంటే, మీరు దానిని పోస్ట్ ఆఫీస్ ద్వారా రీఫండ్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తిరిగి పంపవచ్చు.
ఇది కూడా చదవండి: Bullet Train: భారత్‌కు బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. గంటకు 320 కి.మీ వేగం.. ఏ మార్గంలో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి