విజయవాడ : ఎన్నికల అధికారుల తీరుపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయన విజయవాడలోని మల్లికార్జునపేట పోలింగ్ కేంద్రం దగ్గర ధర్నాకు దిగారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వెనుక వైసీపీ, బీజేపీ కుట్రని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు లోపాలతో ఉన్నాయనీ, ప్రస్తుతం పోలింగ్ నిలిపివేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమని పోలీస్ అధికారులు నచ్చజెప్పారు. అయినా బుద్ధా వెంకన్న వినిపించుకోకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.