Supreme court has given shock to both CM and SEC in AP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నెలకొన్ని రచ్చపై సుప్రీం కోర్టు సూపర్ తీర్పు చెప్పింది. కోర్టుకెక్కిన రెండు పక్షాలకు తలంటినంత పని చేసింది. ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌దే తుది నిర్ణయమంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ ఎందుకు ఎత్తివేయలేదని ఆయనకు చురకలంటించింది. అదే సమయంలో వాయిదాను చెల్లదన్న జగన్ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. కానీ.. వాయిదా వేసిన తర్వాత కోడ్ ఎందుకన్న ప్రభుత్వ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. సో.. స్థానిక ఎన్నికలపై ఏర్పడిన రచ్చపై సుప్రీంకోర్టు తనదైన శైలిలో స్పందించినట్లయ్యింది.
ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభివృద్ధి పథకాలను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. తిరిగి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఎన్నికల సంఘం మే చెప్తుందని స్పష్టం చేసింది. పిటిషన్‌పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు.. అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అప్పటికే అమల్లో ఉన్న వాటిని కొనసాగించవచ్చని తేల్చింది. కొత్త అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రారంభించడానికి మాత్రం వీల్లేదని తెలిపింది.
ఎన్నికల వాయిదా వేసిన నేపథ్యంలో కోడ్ కొనసాగింపును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఎన్నికలు వాయిదా వేస్తూ కోడ్ కింద చర్యలు ఎలా తీసుకుంటారని ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వాయిదా వేస్తే వేశారు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అడ్డుకుంటున్నారన్న ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. కోడ్ కొనసాగింపుపై ఎన్నికల కమిషనర్ తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకపోవడంపైనా ఆక్షేపణ వ్యక్తం చేసింది.
అయితే.. ఎన్నికల నిర్వహణలో మాత్రం ఈసీదే తుది నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల వాయిదా అంశంలో జోక్యం చేసుకోలేమన్న తెలిపింది. ఇది ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి అశనిపాతం కాగా.. కోడ్ విషయంలో మాత్రం కొంత వెలుసుబాటు లభించినట్లయ్యింది. పాత పథకాలను కొనసాగించవచ్చన్న సుప్రీంకోర్టు కొత్త పథకాల ప్రారంభానికి మాత్రం మోకాలడ్డినట్లయ్యింది. ఒక రకంగా జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డంకి తొలగినట్లయ్యింది.