ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇదే అదునుగా కొందరు కరోనా నివారణ మందు పేరుతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఔషథ గుణాలు ఉన్న మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందంటూ ప్రచారం చేసుకుంటున్న స్వీట్ షాపును అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
కరోనా మందు పేరుతో క్యాష్ చేసుకుంటున్నవారి గుట్టురట్టు చేశారు అధికారులు. మైసూర్ పాక్ వల్ల కరోనా నయమవుతుందని ప్రకటించిన స్వీట్ దుకాణాన్ని అధికారులు మూసివేశారు. కోయంబత్తూరు జిల్లా తొట్టిపాళెయంలోని తిరునెల్వేలి లాలా స్వీట్ దుకాణ యజమాని తన దుకాణంలో ఔషధ గుణాలు ఉన్నాయని మైసూర్ పాక్ తింటే కరోనా ఒకే రోజులో నయమవుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇది నిజమేనని నమ్మిన అమాయకులు కొందరు మైసూర్ పాక్ కోసం ఎగబడ్డారు. ఇలా మూడు నెలలుగా విక్రయాలు చేస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చాడు. తన తాత సిద్ధ వైద్యం నేర్పించాడని, దానికి అనుగుణంగా నియామాల ప్రకారం ఔషధ మైసూర్ పాక్ తయారు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ఇది తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి కరోనా తగ్గుతుందన్నాడు. దీనికి సంబంధిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో తమిళనాడు ఆహార, ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు స్వీట్ షాపును తనిఖీ చేశారు. మైసూర్ పాక్ మందు గురించి స్వీట్ దుకాణ యజయాని వద్ద వివరాలు సేకరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా మందు పేరుతో విక్రయం చేయడంతో దుకాణాన్ని సీల్ చేశారు. మొత్తం 120 కిలోల మైసూర్ పాక్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు షాపు యాజమానిపై కేసు నమోదు చేశారు.