రేవంత్.. ఓ దళిత ద్రోహి… మాజీ ఎంపీ ధ్వజం

|

Mar 13, 2020 | 4:13 PM

భూకబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారామ్ నాయక్. దళితులను బెదిరించి, భూకబ్జాలకు, భూ ఆక్రమణలకు రేవంత్ రెడ్డి పాల్పడ్డారని సీతారామ్ నాయక్ ఆరోపించారు

రేవంత్.. ఓ దళిత ద్రోహి... మాజీ ఎంపీ ధ్వజం
Follow us on

TRS former MP Seetharam Naik fires on Revanth Reddy:  భూకబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారామ్ నాయక్. దళితులను బెదిరించి, భూకబ్జాలకు, భూ ఆక్రమణలకు రేవంత్ రెడ్డి పాల్పడ్డారని సీతారామ్ నాయక్ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి, తగిన విధంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి మొదటి నుండి దళిత ద్రోహి అంటున్న సీతారామ్ నాయక్.. ఆయనిపుడు దళితుల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనుల రాజకీయ జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డికి దళితులు, గిరిజనులు అంటే చిన్న చూపని, తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే డ్రోన్ కెమెరాతో ఏదో చేద్దామని చూసి ఫెయిల్ అయ్యారని అన్నారు.

గోపన్నపల్లి భూముల ఆక్రమణ కేసులోనే రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని, పార్లమెంట్‌లో ఉండి… ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి.. భూములు ఆక్రమించుకునే పనిలో పడ్డారని సీతారామ్ నాయక్ అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలోను లక్ష్యానికి వ్యతిరేకంగా పని చేసిన రేవంత్.. ఇపుడు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డిని చీదరించుకుంటున్నారని, ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలని సీతారామ్ నాయక్ సూచించారు.