తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వింత సమస్యతో తెగ వర్రీ అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ సమస్య కారణంగా సొంతూరుకు వెళ్ళాలంటే కూడా ప్రశాంత్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏ జిల్లాకు వెళ్ళేందుకు జంకని మంత్రి సొంత జిల్లాకు వెళ్ళేందుకు మాత్రం తటపటాయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ప్రశాంత్ రెడ్డిని వేదిస్తున్న వింత సమస్య ఏంటో ?
నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో గెలిచిన ఎమ్మెల్యేలే రెండోసారి గెలిచారు. కేవలం ఒకే ఒకరు కొత్తగా ఎన్నికయ్యారు. ఆయన కూడా అధికార పార్టీలో చేరారు. అయితే ఈసారి జిల్లా మంత్రి మాత్రం మారారు. గతంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా ఉంటే ఆయన ఈసారి అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. దాంతో అనూహ్యంగా ముఖ్యమంత్రి కెసీఆర్‌కు అనుయాయుడుగా పేరున్న బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి మంత్రిపదవి దక్కింది.
ఇక్కడి వరకు బాగానే వున్నా.. ఆ తర్వాతనే అసలు సమస్య మొదలైంది. అనూహ్యంగా మంత్రిపదవి దక్కించుకున్న ప్రశాంత్ రెడ్డికి.. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య చాలా గ్యాప్ ఉందని తెలుస్తోంది. మంత్రి పాల్గొనే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కావడం లేదట. తమ కంటే జూనియర్‌యైనా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావడాన్ని కొందరు సీనియర్లు జీర్ణించుకోవడం లేదట. అందుకే మంత్రి కార్యక్రమాలకు ఈ సీనియర్ ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇటు మంత్రి కూడా జిల్లా పర్యటనకు వస్తే తన నియోజకవర్గానికే మాత్రమే పరిమితం అవుతున్నారట. బాల్కొండలో జరిగే పోగ్రామ్స్‌కు ప్రియారిటీ ఇస్తున్నారట. జిల్లా కేంద్రానికి మంత్రి అసలే రావడం లేదట. ఉమ్మడి జిల్లా కార్యక్రమాలకు హాజరుకావడం లేదట. కొంతలో కొంత కామారెడ్డి నియోజకవర్గం వైపు మాత్రమే వెళుతున్నారట. బాల్కొండకు వెళ్ళే హైవేపైనే కామారెడ్డి వుండడం, స్థానిక ఎమ్మెల్యే గంపా గోవర్ధన్‌తో పాటు..మైనారిటీ సెల్ ఛైర్మెన్ ముజీబోద్దిన్‌లతో ప్రశాంత్ రెడ్డికి మంచి సంబంధాలుండడంతో సొంతూరుకు వెళ్ళేప్పుడో.. వచ్చేప్పుడో కామారెడ్డిలో ఆగి కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారని తెలుస్తోంది.
దీంతో ఎమ్మెల్యేలకు,మంత్రి మధ్య గ్యాప్ పెరిగిందని జిల్లాలో టాక్ విన్పిస్తోంది. మంత్రికి,ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ అనే ప్రచారం ఇప్పుడు మీడియాతో పాటు కార్యకర్తల్లో కూడా వైరల్‌గా మారుతోంది. ఇప్పటికైనా మంత్రి జిల్లా వ్యాప్తంగా పర్యటించి… ఈ ప్రచారానికి చెక్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.