
తెలంగాణలో నాటుసారా మాఫియా రెచ్చిపోయింది. తనిఖీకి వెళ్లిన తహశీల్దార్ పై దాడి తెగబడింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో నాటుసారా తయారీదారులు గుడుంబా వ్యాపారం యధేచ్చగా సాగిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ సమయంలో వైన్స్ షాపులకు రాష్ట్ర సర్కార్ అనుమతినిచ్చింది. అటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గుడుంబా తయారీదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా మల్హార్ ప్రాంతంలో నాటుసారా కాస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ, అబ్కారీ శాఖ అధికారులు సంయుక్తంగా గుడుంబా స్థావరాలపై దాడి చేశారు. తనిఖీలకు వెళ్లిన సమయంలో నాటుసారా తయారీదారులు మల్హర్ తహసీల్దార్ శ్రీరాముల శ్రీనివాస్‌పై దాడి చేశారు. దీంతో తహసీల్దార్ శ్రీనివాస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.