తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు ఎగిసిపడుతున్నాయి. 19వ పొయ్యి వద్ద మంటలు చెలరేగాయి. పై కప్పు గోడలకు నెయ్యి జిడ్డు ఉండటంతో ఈ మంటలు త్వరగా వ్యాపించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సిబ్బంది బయటకు రావడంతో ప్రాణనష్టమేమీ జరగలేదు. ఇక ఈ ఘటనతో లడ్డూ తయారీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే తిరుమల బూందీ పోటులో ఇదివరకు చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. వీటిని అరికట్టేందుకు టీటీడీ అధికారులు ప్రతి నెలా పౌర్ణమి, అమవాస్యల్లో మాస్ క్లీనింగ్ నిర్వహిస్తుంటారు. అయినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా లడ్డూలు తయారీ చేసే కేంద్రం కొంచెం చిన్నదిగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు. అందుకే బూందీ తయారీ కోసం పెద్ద భవనం కేటాయించాలని ఎప్పటినుంచో పలువురు డిమాండ్ చేస్తున్నారు.