Government to cancel all Dubai flights from Hyderabad: కరోనా #covidindia ప్రభావం విమానయాన రంగాన్ని కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై పెను ప్రభావం చూపుతోంది. తాజాగా హైదరాబాద్‌కు వచ్చే అన్ని దుబాయ్ ఫ్లైట్లను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు కోరాలని భావిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆయన కరోనా ఇంపాక్ట్‌పై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన అయిదు కరోనా పాజిటివ్ కేసులన్నీ విదేశాలకు వెళ్ళి రావడం వల్ల సోకినవేనని.. ఈ క్రమంలో విదేశీ విమానాలపై నియంత్రణ చేయకపోతే.. వైరస్ మరింత వేగంగా దేశంలో ప్రబలే ప్రమాదం వుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే విమానాలు రద్దు చేసే అవకాశం వుందని ఆయన చెప్పారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వాళ్ళను నేరుగా క్వారంటైన్ చేస్తున్నామని చెప్పారు ఈటల. చైనా, ఇరాన్, ఇటలీ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఆ దేశాల నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు క్వారoటైన్ చేయాలని నిర్ణయించిందన్నారు.
క్వారoటైన్‌లో ఉన్న వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నామని, క్వారంటైన్‌లో ఉన్న వాళ్ళకు కరోనా ఉన్నట్లుగా భావించవద్దని వాళ్ళు పాజిటివ్‌గా తేలేవరకు రోగులు కాదని వివరించారు ఈటల. ఇప్పటి వరకు 221 మందిని క్వారంటైన్‌లో పెట్టినట్లు ఆయన చెప్పారు.