విభజన తర్వాత ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం ప్రకటించిందే నిజమైతే ఏపీకి త్వరలో 2 లక్షల కోట్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఏపీ దశ, దిశ మారిపోతుందని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని కేంద్రం ఏపీ సర్కార్‌కు నేరుగా తెలియజేసింది.
ఏపీకి విస్తారంగా వున్న సముద్ర తీరం, అపారంగా వున్న సహజ వాయు నిక్షేపాలే ఏపీ దశ దిశను భవిష్యత్తులో మార్చేస్తాయని తెలిపారు కేంద్ర పెట్రోలియం, సహజ వనరులు, స్టీల్ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఈ మాటలు ఎక్కడో కాదు.. శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసిన సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాలమైన సముద్ర తీరం.. అందులోని అపార నిక్షేపాలు. ఇవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దశ, దిశను మార్చేస్తాయన్నది ప్రధాన్ అభిప్రాయం.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పెట్రోలియం సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. కృష్ణా-గోదావరి బేసిన్ లోని అపార చమురు గ్యాస్ నిక్షేపాలతో ఏపీకి పెట్టుబడుల తరలి వస్తాయని, ఇప్పటికే ఈ గ్యాస్ వెలికి తీయడానికి విదేశీ పెట్రోలియం సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని ధర్మేంద్ర చెప్పుకొచ్చారు.
కడపలోని ఇనుము ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను ఎన్ఎండీసీ నుంచి సరఫరా చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఏపీ సీఎం జగన్ కోరారు. ఈ అభ్యర్థనకు స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎండీసీ దీనిపై ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు.