
శ్రీలంక క్రికెట్ లో ప్రపంచకప్ 2011 ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్-2011ను భారత్‌కు అమ్మేశాంరటూ శ్రీలంక క్రీడాశాఖా మాజీ మంత్రి మహిందానంద ఆల్తుగమాగె చేసిన ఆరోపణలతో శ్రీలంక ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. ఈ మొత్తం వ్యవహరాన్ని క్రిమినల్ కేసు నమోదు చేసిన ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది. ఇందులో భాగంగా లంక మాజీ క్రికెటర్, మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అరవింద డిసిల్వాను పోలీసు అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. ప్రపంచకప్ 2011 ఫైనల్ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన వివరాలపై కూపీ లాగారు. మంగళవారం సమన్లు జారీ చేసిన పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అనంతరం మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగను విచారిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కౌన్సిల్ సైతం స్వతంత్ర విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశారు. అవసరమైతే విచారణ కోసం భారత్‌కు వస్తానని పేర్కొన్నారు.
జూన్ 15న మాజీ క్రీడా మంత్రి ఆల్తుమాగె ఫిక్సింగ్ జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఆటగాళ్ల ప్రమేయం మాత్రం లేదన్నారు. కాగా ఆయన వ్యాఖ్యలను లంక మాజీ క్రికెటర్లు ఖండించారు. కానీ శ్రీలంక ప్రభుత్వం ఈ విషయాలను సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించింది.