రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర గర్జించింది. ఉమ్మడి మూడు జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనాలతో జనసంద్రాన్ని తలపించింది సాగరతీరం. ఇదే స్ఫూర్తితో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు మంత్రులు. అమరావతికి వ్యతిరేకం కాదు.. కానీ విశాఖకు పాలనా రాజధాని మ హక్కు అంటూ గళం విప్పారు జేఏసీ నేతలు. విశాఖ పర్యటనకు వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు వైసీసీ నేతలు.
కానీ అవి రెండూ ఉత్తరాంధ్ర ఆకాంక్షలకై పోరాడుతున్న ప్రజాహోరు ముందు చిన్నబోయాయి. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తూ.. జన ప్రవాహం ఉప్పెనై పోటెత్తింది. వరుణుడిని కూడా లెక్కచేయక ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ అడుగులో అడుగు వేస్తూ ముందుకుసాగారు ఉద్యమకారులు. మూడు ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన వేలాది గొంతుకుల నినాదం ఒక్కటే… విశాఖకు పరిపాలనా రాజధాని మా హక్కు. జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జన పిలుపునకు మేథావులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, రాజకీయనాయకులు, విద్యావేత్తలు కదం తొక్కారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి..బీచ్‌రోడ్డులోని YS విగ్రహం వరకూ సుమారు రెండున్ననర గంటలపాటు నాలుగైదు కిలోమీటర్లు వర్షంలోనే తడుస్తూ సాగరతీరంలో గర్జించారు ఉత్తరాంధ్ర వాసులు.
ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయంపై నిలదీసిన నేతలు.. హక్కులు కాలరాస్తన్నవారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అమరావతిని రాజధానిగా తాము అంగీకరించినప్పుడు.. విశాఖను పాలనా రాజధానిగా ఎందుకు అంగీకరించరని ప్రశ్నించారు. మూడు రాజధానులపై జనసేన నేత పవన్‌కల్యాణ్ తీరు దురదృష్టకరమన్నారు మంత్రులు. భవిష్యత్‌లో వేర్పాటు వాదాలు రాకుండా ఉండాలంటే..మూడు రాజధానులే పరిష్కారమని స్పష్టం చేశారు.
గర్జన ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే విశాఖకు జనసేనాని చేరుకున్నారు. గర్జనకు పోటీగా ర్యాలీ చేపట్టారు. అటు ఉత్తరాంధ్ర వెనకబాటుకు రెండు ప్రాంతీయ పార్టీలేనంటూ విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు. ఈ రెండు పార్టీలు విశాఖకు, ఉత్తరాంధ్రకు ఏమి చేశాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి ఉత్తరాంధ్ర ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా జేఏసీ చేపట్టిన గర్జన విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. అటు దీనికి కౌంటర్లు సిద్ధం చేసుకుంటున్నాయి విపక్షాలు.
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.
ఇదే అంశానికి సంబంధించి టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం..