Numerology: మీ పుట్టిన తేదీ చెప్పేస్తుంది.. ఏ వయసులో సొంత ఇల్లు యోగం ఉందో..?
Numerology - Own House Yoga: సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పుట్టిన తేదీ ఆధారంగా మూల సంఖ్యను లెక్కించి, ఏ వయసులో సొంత ఇల్లు కొనే యోగం ఎక్కువగా ఉంటుందో తెలుసుకోవచ్చని నమ్ముతారు. మీ మూల సంఖ్య 1 నుంచి 9 వరకు ఏదో తెలుసుకుని, గృహ యోగానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.

సొంత ఇల్లుఅనేది దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే కొందరు చిన్న వయసులోనే ఆ సొంతింటి కలను నిజం చేసుకుంటారు. మరికొందరు ఎన్నో సంవత్సరాల కష్టం, ఆర్థిక స్థిరత్వం తర్వాతే ఇంటి యజమానులు అవుతారు. సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, ఒకరి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వంతో పాటు జీవితంలోని కొన్ని ముఖ్యమైన అవకాశాల గురించి కూడా సూచనలు ఇస్తుందని నమ్ముతారు. అందులో ఏ వయసులో సొంత ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో కూడా అంచనా వేయవచ్చని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పుట్టిన తేదీతో వచ్చే మూల సంఖ్య ద్వారా దీన్ని లెక్కిస్తారు.
మీ మూల సంఖ్య (Radix Number) ఎలా తెలుసుకోవాలి?
1, 2, 3…9 వంటి ఒక అంకె తేదీల్లో పుట్టిన వారికి అదే మూల సంఖ్య.
రెండు అంకెల తేదీ అయితే వాటిని కలిపి ఒక అంకె వచ్చే వరకు కూడాలి.
ఉదాహరణ: 28 తేదీన పుట్టినట్లయితే 2+8 = 10, ఆ తర్వాత 1+0 = 1. కాబట్టి మూల సంఖ్య 1 అవుతుంది.
మూల సంఖ్యల జాబితా
మూల సంఖ్య 1: 1, 10, 19, 28
మూల సంఖ్య 2: 2, 11, 20, 29
మూల సంఖ్య 3: 3, 12, 21, 30
మూల సంఖ్య 4: 4, 13, 22, 31
మూల సంఖ్య 5: 5, 14, 23
మూల సంఖ్య 6: 6, 15, 24
మూల సంఖ్య 7: 7, 16, 25
మూల సంఖ్య 8: 8, 17, 26
మూల సంఖ్య 9: 9, 18, 27
మూల సంఖ్యలు 4, 6, 8: గృహ యోగం ఎప్పుడంటే..?
మూల సంఖ్యలు 4, 6, 8 కలిగిన వారు ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే స్వభావం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. వీరు పొదుపుకు ప్రాధాన్యం ఇస్తారు. ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచన బలంగా ఉంటుంది. అందువల్ల 30 నుంచి 40 ఏళ్ల మధ్య సొంత ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.
మూల సంఖ్యలు 3, 5, 7: గృహ యోగం ఎప్పుడంటే..?
3, 5, 7 మూల సంఖ్యల వారు విద్య, ఉద్యోగం, వ్యాపారం, కొత్త అనుభవాలు, ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెబుతారు. దీంతో సొంత ఇల్లు కొనుగోలు చేసే నిర్ణయం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పూర్తిగా స్థిరపడిన తర్వాత, ముఖ్యంగా 50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గృహ యోగం బలపడుతుందని సంఖ్యాశాస్త్ర విశ్వాసం.
మూల సంఖ్యలు 1, 2, 9: గృహ యోగం ఎప్పుడంటే..?
1, 2, 9 మూల సంఖ్యల వారికి కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా లభిస్తుందని చెబుతారు. తల్లిదండ్రులు లేదా పూర్వీకుల నుంచి ఆస్తి, ఇల్లు లేదా స్థలం రూపంలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే తమ సొంత కృషితో కూడా జీవితంలో తక్కువ వయస్సులోనే ఇల్లు నిర్మించడం లేదా కొనుగోలు చేయడం వంటి అవకాశాలు కలగవచ్చని సంఖ్యాశాస్త్రం పేర్కొంటుంది.
సంఖ్యాశాస్త్రం అనేది ఒక విశ్వాస ఆధారిత విధానం మాత్రమే. సొంత ఇల్లు కొనుగోలు చేసే అవకాశం వ్యక్తిగత ఆదాయం, ఉద్యోగం, కుటుంబ పరిస్థితులు, పొదుపు, పెట్టుబడులు, రుణ సౌకర్యాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సంఖ్యాశాస్త్ర సూచనలను ఒక సాధారణ మార్గదర్శకంగా మాత్రమే పరిగణించడం మంచిది.
(గమనిక: ఈ కథనం సంఖ్యాశాస్త్ర విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించిన వాస్తవంగా భావించరాదు.)
Also Read: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి మాసఫలాలు




