Telugu News Astrology Kala Sarpa Dosha from May 13 to 25: These Zodiac Signs Need to Be Careful
Kala Sarpa Dosha: నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
మే 13 నుంచి 25 వరకు ఏర్పడనున్న కాలసర్ప దోష ప్రభావంతో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో అపజయాలు, ఆర్థిక నష్టాలు, మోసాలు, ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉండగా, కొన్ని రాశుల వారు ప్రతిరోజూ స్కంద స్తోత్రం పఠించడం ద్వారా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
జ్యోతిషశాస్త్రంలో కాలసర్ప దోషాన్ని చాలా ప్రమాదకరమైన దోషంగా అభివర్ణించడం జరిగింది. గ్రహాలన్నీ రాహు, కేతువుల మధ్య సంచారం చేయడాన్ని కాలసర్ప దోషం అంటారు. అది ఈ నెల(మే) 13 నుంచి 25వ తేదీ వరకు ఏర్పడుతోంది. సింహంలో ఉన్న కేతువుకు, కుంభ రాశిలో ఉన్న రాహువుకు మధ్య గ్రహాలన్నీ సంచారం చేయడం జరుగుతోంది. కాలసర్ప దోషం కలిగే పక్షంలో అపజయాలు, వైఫల్యాలు, మోసాలు, నష్టాలు, నమ్మకద్రోహాలు, అనారోగ్యాలు కాస్తంత ఎక్కువగా ఉంటాయి. ఈ దోషం కలిగిన మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారు ప్రతి రోజూ స్కంద స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మిథునం: ఈ రాశికి 3, 9 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం వల్ల కాలసర్ప దోషం ఏర్పడింది. కొన్ని ముఖ్యమైన అవకాశాలు చేజారిపోతాయి. విదేశీ ఆఫర్లు కూడా చేజార్చుకోవడం జరుగుతుంది. అధిక వ్యయానికి, ఆకస్మిక వ్యయానికి అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువ లాభం తక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది. ఆప్తులు, ఆత్మీయులు దూరం కావడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం తగ్గుతాయి.
కర్కాటకం: ఈ రాశికి ధన, అష్టమ స్థానాల్లో కాలసర్ప యోగ ప్రభావం పడింది. అందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయంతో పాటు ప్రాభవం కూడా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరు పట్ల అసంతృప్తి చెందుతారు. బంధు మిత్రుల వల్ల అపనిందల పాలయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆస్తిపాస్తుల సమస్యలు వృద్ధి చెందుతాయి. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందదు.
సింహం: ఈ రాశిలో కేతువు, సప్తమ స్థానంలో రాహువు ఉండడం వల్ల కాలసర్ప దోషం కలిగింది. ఇంటా బయటా అనుకూలతలు బాగా తగ్గి టెన్షన్లు పెరుగుతాయి. సన్నిహితులతో అపార్థాలు తలెత్తుతాయి. డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వక ఇబ్బంది పెడతారు. మీరు ఇవ్వాల్సిన చోట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు పైచేయి సాధిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఆదాయ ప్రయత్నాలు కలిసి రావు.
వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న రాహువుకు, దశమ స్థానంలో ఉన్న కేతువుకు మధ్య గ్రహాలు చేరుతున్నందువల్ల కాలసర్ప దోషం కలిగింది. ఆరోగ్యం, వాహన ప్రమాదాలు, అపనిందలు, అభి యోగాల వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం తగ్గుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మకరం: ఈ రాశికి ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఈ కాలసర్ప దోషం కలగడం వల్ల మానసిక ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా తగ్గే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు కొద్దిగా ఇబ్బంది కలిగి స్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావలసివస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా మంద గిస్తాయి. శుభ కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్తలు అందకపోవచ్చు.
కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఏర్పడిన కాలసర్ప యోగం ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్థలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించకపోవచ్చు. ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా తగ్గుతుంది.