Telugu News Astrology Jupiter Transit into Cancer 2026: Relief from Shani Dosha for These 6 Zodiac Signs Till October 31
Guru Blessings: ఆ రాశులకు శని దోషాల నుంచి విముక్తి..! ఆదాయం పెరిగే ఛాన్స్..!
Guru Gochar 2026: జూన్ 2న గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల శని దోషం (Shani Dosha)తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరు రాశుల వారికి పెద్ద ఊరట లభించనుంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు అక్టోబర్ 31 వరకు గురు కటాక్షంతో శని ప్రభావం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గురువు జూన్ 2న తనకు ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మిగిలిన రాశుల న్నిటి కంటే శని దోషంతో అవస్థలు పడుతున్న ఆరు రాశుల వారికి ఎంతో ఉపశమనం కలగబోతోంది. గత ఏడాది మార్చిలో శనీశ్వరుడు మీన రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కొన్ని రాశులకు శని దోషం పట్టుకుంది. శని దోషం పట్టుకున్న రాశుల వారు నానా కష్టాలూ పడడం జరుగుతోంది. మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశులకు శని దోషం ఏర్పడినందు వల్ల వీరు ఏ పనీ, ఏ ప్రయత్నమూ కలిసి రాక ఇబ్బందులు పడడం జరుగుతోంది. ఈ ఆరు రాశుల వారికి గురు దృష్టి వల్ల శని దోషం నుంచి అక్టోబర్ 31 వరకు విరామం లభించింది.
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారికి గత ఏడాది ప్రారంభంలో ఏలిన్నాటి శని దోషం ప్రారంభం అయింది. దీనివల్ల వీరికి ఏ పనీ, ఏప్రయత్నమూ ఒక పట్టాన కలిసి రాదు. వ్యయప్రయాసలు, శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. అయితే, గురువు శుభ దృష్టి శని మీద పడినందు వల్ల వీరికి ఇక ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. అతి తక్కువ శ్రమతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.
సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల ఈ రాశివారికి పని ఒత్తిడి, పని భారం బాగా పెరుగుతాయి. దుర్వార్తా శ్రవణం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యం బాగా తగ్గే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలకు అవకాశం ఉంది. అయితే, గురు దృష్టి వల్ల శని దోషం పూర్తిగా తగ్గిపోయి, ఆదాయం పెరగడం, జీవితం హ్యాపీగా సాగిపోవడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని విజయాలు కలుగుతాయి.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి కొద్దిగా శని దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. వైవాహిక సమస్యలు తలెత్తుతాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు. ఆర్థిక సమస్యలకు అవకాశం ఉంది. అయితే, శని మీద గురువు దృష్టి పడడం వల్ల ఈ సమస్యల నుంచి పూర్తిగా బయటపడడంతో పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
ధనుస్సు: మీన రాశిలో శని ప్రవేశం వల్ల ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల వీరికి కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ఆస్తి సమస్యలు, వివాదాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలుంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. రాశ్యధిపతి గురువు ఉచ్ఛపట్టడంతో పాటు శనిని వీక్షించడంవల్ల సుఖ సంతోషాలు, అనుకూలతలు పెరుగుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం కొనసాగుతోంది. ధన, కుటుంబ జీవితాలకు సంబంధించిన ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు పురోగతి చెందే అవకాశం ఉండదు. కుటుంబంలో ఖర్చులు పెరగడం, అనారోగ్యాలు చుట్టు ముట్టడం, అపార్థాలు తలెత్తడం వంటివి జరుగుతాయి. గురు దృష్టి వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని దోషం కలిగింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా తగ్గుతుంది. పదోన్నతులకు అవకాశం ఉండదు. ఏ ప్రయత్నం చేపట్టినా శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. పురోగతీ ఉండకపోవచ్చు. అయితే, రాశి నాథుడు గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టి శనిని వీక్షించడం వల్ల జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.