Happy Zodiac Signs
జ్యోతిషశాస్త్రం ప్రకారం నాలుగవ స్థానాన్ని బట్టి సుఖ సంతోషాలను అంచనా వేయాల్సి ఉంటుంది. నాలుగవ స్థానాధిపతి, నాలుగవ స్థానం అనుకూలంగా ఉన్న పక్షంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడంతో పాటు, గృహ, వాహన సౌకర్యాలు పెరగడం, ఆస్తిపాస్తులు సమకూరడం, హోదా పెరగడం, మాతృ సౌఖ్యం లభించడం వంటివి జరుగుతాయి. ప్రస్తుతం వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, కుంభ రాశులకు చతుర్థాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశుల వారికి ఇటువంటి యోగాల్లో ప్రధానమైనవి పట్టడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన రవి ప్రస్తుతం ఇదే రాశిలో ఉండడం వల్ల గృహ, వాహన యోగాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా పెరగడం జరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. పిత్రార్జితం చేతికి వచ్చే సూచనలున్నాయి. ఆస్తులు కొనడం జరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. తల్లి తండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. ఇంట్లో సౌకర్యాలు మెరుగుపడతాయి. తల్లితో లేదా తల్లి వైపు బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన కుజుడు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల చతుర్థ స్థాన ఫలితాలు పూర్తి స్థాయిలో అనుభవానికి వస్తాయి. గృహ, వాహన సౌకర్యాలు తప్పకుండా ఏర్పడతాయి. బంధుమిత్రులతో సఖ్యత బాగా పెరుగుతుంది. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. సమా జంలో పలుకుబడి వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యానికి లోటుండదు. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
- కన్య: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉన్నందువల్ల ఈ రాశివారి సుఖ సంతో షాలకు మరో ఏడాది పాటు ఎటువంటి లోటూ ఉండదు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా కూడా పెరిగే సూచనలున్నాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. తల్లి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. సామాజికంగా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
- తుల: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు పంచమ కోణంలో స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల గృహ, వాహన యోగాలు తప్పకుండా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. తల్లి వైపు నుంచి ఆస్తి లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. విలాస జీవితం అలవడుతుంది. ఇష్టమైన ప్రాంతాలను, ప్రదేశాలను సందర్శిస్తారు.
- కుంభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన శుక్రుడు స్వస్థానమైన వృషభ రాశిలో సంచరిస్తున్నందువల్ల, కుటుంబంలో సుఖ సంతోషాలకు, ఆనందోత్సాహాలకు లోటుండదు. అందమైన గృహం కలిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.