
Parivarthan Yoga
Telugu Astrology: తండ్రీ కుమారులైన చంద్ర బుధుల మధ్య ఈ నెల(జూన్) 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు పరివర్తన జరుగుతోంది. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో బుధుడు, బుధ గ్రహానికి చెందిన మిథున రాశిలో చంద్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ పరివర్తన యోగం చోటు చేసుకుంది. ఈ యోగం సంభవించేది మూడు రోజులే అయినప్పటికీ, ఈ మూడు రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాల ప్రభావం బుధుడు రాశి మారే వరకు, అంటే ఆగస్టు వరకు వర్తిస్తుంది. ఈ రెండు గ్రహాల పరివర్తన వల్ల నైపుణ్యాలు పెరగడం, వ్యూహాలు, ప్రణాళికలు విజయవంతం కావడం, విదేశీయానానికి అవకాశాలు లభించడం వంటివి జరుగుతాయి. మేషం, మిథునం, కన్య, తుల, మీన రాశులకు శుభ యోగాలు కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి తృతీయ, చతుర్ధాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వాహన యోగం పడుతుంది. ఈ మూడు రోజుల పరివర్తన కాలంలో ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది.
- మిథునం: ఈ రాశికి 1, 2 స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూల వుతాయి. మదుపులు, పెట్టుబడుల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కన్య: ఈ రాశికి దశమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు అదనపు రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యో గులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి.
- తుల: ఈ రాశికి భాగ్య, దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల కొద్ది ప్రయత్నంతో తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- మీనం: ఈ రాశికి చతుర్థ, పంచమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కుటుంబంలో అనేక విధాలుగా సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో సైతం పరిచయాలు ఏర్పడతాయి.