YSRCP leader arrested: ఏపీలో అధికార వైఎస్ఆర్‌సీపీ నేత ఎంపీడీవోను దూషించిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తమ మాట వినకపోతే.. చీరేస్తాం అంటూ మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే.. ఈ ఘటన అనంతరం పోలీసులు చర్యలు ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్ విజయను దుర్భాషలాడిన వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీని అదుపులోకి తీసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. మంగళవారం పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ సర్పంచ్ తాతాజీ, అయినవిల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, కె. జగన్నాథపురం సర్పంచ్ భర్త మేడిశెట్టి శ్రీనివాస్, శంకరాయగూడెం మాజీ సర్పంచ్ కుడిపూడి రామకృష్ణ తమ మాట వినకపోతే చీరెస్తాం అంటూ ఎంపీడీవో విజయను బెదిరించారని పేర్కొన్నారు. ఎంపీడీవో విజయ ఫిర్యాదు మేరకు సోమవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం, ఆడవారిని అసభ్య పదజాలంతో దూషించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు మాధవరెడ్డి వెల్లడించారు. వీరిలో మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. ఎంపీడీవోను బెదిరించినందుకు నిరసనగా జిల్లాలో పలు ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది నిరసన తెలిపారు. అధికారులను వేధించడం మానుకోవాలంటూ పలువురు డిమాండ్ చేశారు.
Also Read: