YSRCP: మంత్రి జయరాంపై వైసీపీ అధిష్టానం సీరియస్

మంత్రి జయరాంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. కర్నూలు లోక్‌సభకు పోటీపై విముఖత చూపడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్‌లతో టచ్‌లోకి వెళ్లడంపై హైకమాండ్ ఆరా తీసిందట. త్వరలోనే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

YSRCP: మంత్రి జయరాంపై వైసీపీ అధిష్టానం సీరియస్
Gummanur Jayaram

Updated on: Feb 01, 2024 | 9:45 AM

కర్నూలు, ఫిబ్రవరి 1: ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు రాంరాం చెప్పేందుకు సిద్ధమైంది వైసీపీ. కర్నూలు లోక్‌సభ స్థానానికి పోటీకి విముఖత చూపడంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి సీఎం జగన్‌ను కలిసిన జయరాం, అంతకుముందు కేబినెట్‌ భేటీలోనూ పాల్గొన్నారు. సీఎంతో భేటీ సందర్భంగా ఆలూరు ఇన్‌ఛార్జ్‌ విరూపాక్షిని మార్చాలని కోరారు జయరాం. ఈ ప్రతిపాదనకు అంగీకరించని సీఎం ఇదివరకే ప్రకటించాం, కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమైన విరూపాక్షి ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

— అయితే కర్నూలు పార్లమెంట్‌కు మంత్రి జయరాం పోటీ చేస్తారా? చేయరా? చేయాలనుకున్నా పార్టీ అంగీకరిస్తుందా? లేదా? ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయ అంశంగా మారింది. మంత్రి జయరాం టీడీపీ, కాంగ్రెస్‌లతో టచ్‌లో ఉండటం పై వైసీపీ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. వాస్తవానికి ఇప్పటికే కర్నూలు మేయర్ రామయ్యను కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం.

కాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి నాగేంద్రతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు జయరాం. అక్కడి మంత్రి నాగేంద్ర జయరాంకు సమీప బంధువు. కాంగ్రెస్‌లో చేరితే ఆయనకు ఆలూరు టిక్కెట్ కేటాయించడం పక్కా అని తెలుస్తోంది. అదే విధంగా కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో ఉందట కాంగ్రెస్. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఐదు సీట్లు కోరుతున్నారు. వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఆయన అడుగుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జయరాంను ఉపయోగించుకుంటే పార్టీకి బలం చేకూరుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మరోవైపు టీడీపీతో కూడా టచ్‌లోకి వెళ్లారు జయరాం. ఆ పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపారు. మరి ఫైనల్‌గా జయరాం.. ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి