
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మహిళలకు ఉచితం కావడంతో రద్దీను ఆసరాగా చేసుకుని కొంతమంది మహిళలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణీకుల్లా నటిస్తూ ఇతర ప్రయాణీకుల బ్యాగుల్లోని బంగారు నగలు అపహరించి ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలెంకు చెందిన సుమతి ఈనెల 1వ తేదిన పర్చూరులోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. తన బ్యాగ్‌లో 20 లక్షలు విలువచేసే 20 సవర్ల బంగారు నగలు తీసుకుని జాగ్రత్తగానే బస్సు ఎక్కింది. బ్యాగ్‌లో నగలు ఉండటంతో బస్సు ఎక్కిన కొద్ది సేపటికి పరిశీలించి చూసుకుంది. అంతే ఆమె మతిపోయింది. తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు… ఎవరో గుర్తుతెలియని దొంగలు తన బ్యాగ్ నుంచి నగలు చోరీ చేశారని గ్రహించి వెంటనే కేకలు వేసింది. అయితే అప్పటికే ఆ మహిళా దొంగ ఉడాయించింది… ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దీంతో చోరీ చేసిన మహిళ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి… నేరం చేసింది బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన ద్వారకా అనే మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని మొత్తం సుమారు 20 సవర్ల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు ఒంగోలు వన్ టౌన్ సిఐ నాగరాజు. రద్దీని తమను అనుకూలంగా మార్చుకుంటున్నారు దొంగలు. అసలే బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అందుకే మహిళామణులూ.. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు జరంత పైలం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.