
విజయనగరం జిల్లాలో ఒక శుభకార్యం పెను విషాదంగా మారింది. పెళ్లి వేడుక ముగిసిన ఆనందంలో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన కుటుంబ సభ్యులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. టిప్పర్ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జామి మండలం అన్నంరాజుపేటకు చెందిన మట్లా సన్యాసిరావు (48) తన చిన్న కుమారుడికి పాచిపెంట మండలం తోటవలసకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. శనివారం రాత్రి వధువు ఇంటి వద్ద వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పెళ్లి తంతు ముగిశాక, కొత్త జంట కారులో బయలుదేరగా.. వరుడి తండ్రి సన్యాసిరావు, తల్లి కనకమ్మ, సోదరి మంగమ్మ, వధువు చిన్నాన్న లావేరు పైడిరాజు (55) మరో ఇద్దరితో కలిసి ఆటోలో అన్నంరాజుపేటకు ప్రయాణమయ్యారు.
వీరి ఆటో జన్నివలస సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపైకి చేరుకోగానే, రాంగ్ రూట్‌లో వేగంగా వస్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది. టిప్పర్ టైరు పేలడంతోనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వరుడి తండ్రి సన్యాసిరావు, వధువు చిన్నాన్న పైడిరాజు మరణించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుడి తల్లి కనకమ్మ, చెల్లి మంగమ్మ ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
ఒకే ప్రమాదంలో పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు చిన్నాన్న మృతి చెందడంతో అన్నంరాజుపేట, చాకలిపేట గ్రామాల్లో నిశ్శబ్దం ఆవరించింది. కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వధూవరులు ఈ వార్త విని షాక్‌కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పుగా వస్తున్న వాహనాలు ఎంతటి ప్రాణనష్టాన్ని కలిగిస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..