పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండల ఏజెన్సీకి పెద్దపులి భయం పట్టుకుంది. గత రెండు రోజులుగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం పెరిగిపోయింది. రెండు రోజుల నుంచి మండలంలోని కట్కూరు బీట్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులి సంచరిస్తుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుకునూరు, వేలేరుపాడు మండలాల అటవీశాఖ అధికారులు కట్కూరు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
తాజాగా అధికారులు అడవుల్లో పెద్దపులి తిరిగిన ఆనవాళ్లను గుర్తించి పాదముద్రలను సేకరించారు. అంతేకాకుండా పెద్దపులి దాడిలో బలైన పశువుల మృతదేహాలు కూడా అధికారులకు లభ్యమయ్యాయి. పెద్దపులి సంచరిస్తున్న అటవీ ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి. గొల్లగూడెం, కొత్తూరు, తెల్లపల్లి, గుల్లమడుగు, చిగురుమామిడి, కట్కూరు, కోయిదా, టేకూరు గ్రామాలు ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు భయంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కట్కూరు ప్రాంతం కూనూరు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు అటవీ అధికారులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. వెంటనే పులిని పట్టుకొని భద్రత కల్పించాలని ఎజెన్సీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు.