
విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయంలో అద్భుత దృష్యం ఆవిష్కృతమైంది. నిత్యపూజల్లో భాగంగా ఆయన ప్రధాన అర్చకులు సిద్ధాంతం గణపతి రావు స్వామివారి విగ్రహాలకు అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఓ నాగుపాము బుసలు కొడుతూ ఆలయ ప్రాంగణంలోకి వచ్చింది. గుడిలో కనిపించిన నాగుపామును చూసిన అర్చకులు, భక్తులు మొదట భయాందోళనకు గురైనా.. ఆ తర్వాత కొంత ధైర్యం తెచ్చుకొని అది స్వామివారు పంపిన నాగశేషుడేనని భక్తితో నమస్కరించారు. దీంతో ఆ నాగషేషు సైతం భక్తులకు ఎవరికి ఎలాంటి హాని చేయకుండా కాసేపటి తర్వాత అక్కడే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది.
సోమవారం శివారాధనకు ఎంతో విశిష్టమైన రోజుగా భావించే నేపథ్యంలో నాగుపాము ప్రత్యక్షం కావడం విశేషంగా మారింది. నాగేంద్రుడు స్వయంగా శివుని ఆభరణంగా, శివతత్వానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. దీంతో ఈ ఘటనను శివుని అనుగ్రహంగా భావించిన భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగేంద్రుడికి నమస్కరించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయంలో నాగుపాము కనిపించిందన్న విషయం పరిసర ప్రాంతాల్లోని భక్తులకు తెలియడంతో పలువురు ఆలయానికి చేరుకున్నారు.
ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. పవిత్ర సోమవారం రోజున సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగేంద్రుడి దర్శనం లభించడం తమకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని పలువురు భక్తులు పేర్కొన్నారు. సంగం సంగమేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనంతో పాటు నాగేంద్రుడి దర్శనం కూడా లభించడంతో ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.